Begin typing your search above and press return to search.

మోర్బీ ఘటన.. జాక్‌పాట్‌ కొట్టిన బీజేపీ నేత!

By:  Tupaki Desk   |   10 Nov 2022 11:33 AM GMT
మోర్బీ ఘటన.. జాక్‌పాట్‌ కొట్టిన బీజేపీ నేత!
X
కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో వేలాడే తీగల వంతెన తెగి 135 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు కన్నుమూయడంతో దేశమంతా విషాదంలో మునిగిపోయింది.

కాగా ఆ సమయంలో మోర్బీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కంతిలాల్‌ అమృతీయ ప్రమాదం జరిగినప్పుడు నదిలోకి దూకి పలువురి ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. అలాగే చివరి వరకు ఆయన అక్కడే ఉండి సహాయక చర్యల్లోనూ పాలుపంచుకున్నారు.

అక్టోబర్‌ 30వ తేదీన రాత్రి ప్రమాదం జరగ్గా.. ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న కంతిలాల్‌ అమృతీయ లైఫ్‌ ట్యూబ్‌ ధరించి నీళ్లలోకి దూకి సహాయక చర్యల్లోకి పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి.

కాగా కంతిలాల్‌ అమృతీయ గతంలో రెండుసార్లు మోర్బీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయన మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

దీంతో కంతిలాల్‌ అమృతీయ సాహసం గురించి మీడియా, సోషల్‌ మీడియాలో మంచి ప్రచారం లభించింది. ఇదే ఇప్పుడు ఆయన జాక్‌పాట్‌గా మారింది. ప్రస్తుతం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. డిసెంబర్‌ మొదటి వారంలో రెండు దశల్లో ఎన్నికలు జరగునున్నాయి.

ఈ నేపథ్యంలో కంతిలాల్‌ అమృతీయకు బీజేపీ మోర్బీ అసెంబ్లీ స్థానం నుంచి సీటు ఇచ్చింది. వాస్తవానికి ప్రమాదానికి ముందు కంతిలాల్‌ సీటు దక్కించుకునేవారి జాబితాలో లేరు.

అయితే మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం సమయంలో ఆయన బాధితులను రక్షించడం, సహాయక చర్యలు చేపట్టడం ద్వారా మీడియా, సోషల్‌ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. దీంతో ఆయనకు సీటు ఇస్తే మోర్బీ స్థానాన్ని సులువుగా గెలుచుకోవచ్చని భావించిన బీజేపీ కంతిలాల్‌ అమృతీయకు తొలి విడతలోనే సీటు కట్టబెట్టింది.

వాస్తవానికి మోర్బీకి ప్రస్తుతం మరో బీజేపీ వ్యక్తి బ్రిజేష్‌ మెర్జా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనను పక్కనపెట్టిన బీజేపీ అనూహ్యంగా కంతిలాల్‌కు సీటు ఇచ్చింది. తద్వారా ఆయన జాక్‌పాట్‌ కొట్టారు.

ప్రస్తుతం మోర్బీ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న బ్రిజేష్‌ మెర్జాకు సీటు ఇస్తే ప్రజా వ్యతిరేకతలో ఆయన ఓడిపోతాడని భావించిన బీజేపీ సహాయక చర్యలతో మంచి పేరు దక్కించుకున్న కంతిలాల్‌ అమృతీయకు సీటు కట్టబెట్టింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.