Begin typing your search above and press return to search.

అరవింద.. నీ పని గోవిందా..?

By:  Tupaki Desk   |   17 Dec 2019 7:22 AM GMT
అరవింద.. నీ పని గోవిందా..?
X
పౌరుషాల గడ్డ మీద పౌరుషంగా హామీనిచ్చారు మన నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఈ బీజేపీ ఆసామీ మొన్నటి ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కవితను ఓడించేశారు. బలమైన ప్రత్యర్థిని చిత్తు చేయడానికి అరవింద్ కు బలం బలగం రైతులే. వారి చిరకాల కోరిక అయిన ‘పసుపు బోర్డు, ఎర్రజొన్నలకు మద్దతు’ ధరను తనను గెలిపిస్తే వెంటనే ఏర్పాటు చేస్తానని మన అరవింద్ మాట ఇచ్చాడు.. ఇప్పుడు ఆరు నెలలు అయ్యింది.. అరవింద్ మాట తప్పారు. మడమ తిప్పేశారు..

‘పసుపు బోర్డు వేస్ట్. దాంతో రైతులకు ఏం ప్రయోజనం లేదు. కేంద్రం తెస్తున్న కొత్త విధానంతో రైతులకు మంచి జరుగుతుంది. ఆందోళనలు చేసేటోళ్లను నే పట్టించుకోను.. ’ అంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ నాలుక మడతట్టేశారు.

కేసీఆర్ కూతురినే పగబట్టి ఓడించిన పసుపు రైతులు ఊరుకుంటారా.? ఎంపీ అరవింద్ పై పోరుబాట పట్టారు. ‘ఏ ఊకో అరవింద్.. నమ్మించి పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసి.. ఇప్పుడు అవి వేస్ట్ అంటావా? గింత మోసంజేస్తావా’ అంటూ నిన్న సమావేశమైన రైతులు అరవింద్ రైతులకు రాసిచ్చిన బాండ్ ను చూపించి మరీ ఆక్రోశించారు. నిజామాబాద్ ఎంపీపై పోరుబాటకు శ్రీకాం చుట్టారు.

అరవింద్ చేసిన మోసంపై నిజామాబాద్ రైతులు తాజాగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధర కోసం నేటి నుంచి రైతు జేఏసీ పాద్రయాత్రకు శ్రీకారం చుట్టింది. వీరికి మద్దతుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు పసుపు బోర్డు కావాల్సిందేనని మరో ఉద్యమానికి తెరలేపుతున్నారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులు తాము పార్టీలకతీతంగా యాత్ర చేపడుతున్నామని పేర్కొంటుంటే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఎంపీ అరవింద్ టార్గెట్ గా ఉద్యమం నిర్వహిస్తామని ప్రకటిస్తున్నారు.

ఇలా మాట ఇచ్చి నాలుక మడతేసిన అరవింద్ పని అయిపోయినట్టే కనిపిస్తోంది. కవితను పట్టుబట్టి ఓడించిన రైతన్నలు ఇప్పుడు అరవింద్ ను వదలుతారనుకుంటే పొరపాటే. పైగా రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో వారి ప్రోత్సాహం రైతులకు ఉండనే ఉంటుంది. దీంతో అరవింద్ బుక్ కావడం ఖాయం. మరి ఈ ఉపద్రవం నుంచి బీజేపీ ఎంపీ ఎలా తప్పించుకుంటాడు? మోసపోయిన రైతులు ఎలా ఉపేక్షిస్తారన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. అప్పటి వరకూ ఈ రంజైనా రాజకీయాన్ని గులాబీ శ్రేణులు తెగ ఎంజాయ్ చేస్తూ చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. ‘అరవింద.. నీ పని గోవిందా’ అని టీఆర్ఎస్ ముఖ్యులు ఇప్పటికే స్కెచ్ గీశారని తెలుస్తోంది.