Begin typing your search above and press return to search.

వైసీపీ ప్రచార కక్కూర్తి పీక్స్ లో... ?

By:  Tupaki Desk   |   6 Jan 2022 11:30 AM GMT
వైసీపీ ప్రచార కక్కూర్తి పీక్స్ లో... ?
X
రాజకీయం ఇది. క్రెడిట్ కోసం కలహాలు పడే కాలమిది. డబ్బులు మేమిచ్చాం, పేరు మీకా అని ఒకరి మీద ఒకరు నిప్పులు చెరిగే రోజులు ఇవి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ ప్రధాని. మోడీ అమిత్ షా జమానాలో బీజేపీ ప్రచారం ఎంత పీక్స్ కి వెళ్ళిందో అందరికీ తెలిసిందే. అలాంటిది బీజేపీ పధకాలను తమ పేరు మీద ప్రచారం చేసుకుంటే ఊరుకుంటారా. ఇపుడు అదే వైసీపీ వర్సెస్ బీజేపీ గా మారుతోంది.

మా పధకాల మీద మీ స్టిక్కర్లు ఏంటి అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కస్సుమంటున్నారు. కేంద్రం వేల కోట్లను పధకాలకు ఇస్తూంటే వాటి మీద మీ బ్రాండ్ వేసుకోవడమేంటి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. లేటెస్ట్ గా ప్రధాని కిసాన్ యోజన పధకం కింద రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అది కూడా తమ పధకంగా వైసీపీ ప్రచారం చేసుకోవడమేంటి అని ఆయన నిలదీశారు.

ప్రచార యావకు ఇది పరాకాష్టగా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రతీ పైసా కేంద్రం ఇచ్చిన నిధుల నుంచే ఖర్చు అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దివాళా తీసింది అని ఆయన విమర్శిస్తున్నారు. జల్ జీవన్ మిషన్ కి కేంద్రం మూడు వేల 180 కోట్లను కేటాయిస్తే దానికి తీసుకోవడాంకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటే ఈ ప్రభుత్వం తీరు ఏంటి అన్నది జనాలు అర్ధం చేసుకోవాలి. గత ఏడాది పధకానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్లనే ఈ పధకం వాడుకోలేకపోతున్నారు అని ఆయన అన్నారు.

మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మావీ, మేమే అంతా అని జీవీఎల్ చెప్పడం పట్ల విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం అంటే మిధ్య అని నాటి సీఎం ఎన్టీయార్ అన్నారు. మరో వైపు చూసుకుటే కేంద్రానికి ప్రత్యేక భూభాగం లేదు. రాష్ట్రాల నుంచి కట్టిన పన్నులే కేంద్రానికి జమ అవుతాయి. ఆ విధంగా ప్రజలు కట్టిన డబ్బులను మావి అని చెప్పి కేంద్రం పెత్తనం చేయడమేంటి అన్న విమర్శలూ ఉన్నాయి. అయితే రాష్ట్రం మాత్రం ఏ నాయకుడి ఇంట్లో నుంచి తేవడం లేదు కదా. రాష్ట్రం కూడా ప్రజల పన్నులతో వచ్చిన డబ్బులను పధకాలుగా ఇస్తూ తమ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోంది. మరి కేంద్రంలోని బీజేపీ కూడా ఇపుడు అదే చేయాలనుకుంటోంది.

అందుకే రాష్ట్రంలో అమలవుతున్నా కేంద్ర పధకాల తీరు తెన్నులను గమనించడమే కాకుండా ప్రజలకు వాటి మీద అవగాహన కల్పించాలని బీజేపీ భావిస్తోంది. జీవీల్ నరసింహారావు లాంటి వారు వాటిని ప్రచారం చేసే బాధ్యతలను తీసుకున్నారు. మొత్తానికి మేం ఇది చేశామంటే మేమే చేశామని వైసీపీ బీజేపీ వాదులాడుకోవడం మాత్రం జనాలలో చర్చగా ఉంది. చేయాల్సింది ఎంతో ఉంది. అయినా మేమే అంటూ రెండు పార్టీలు రాజకీయాలు చేయడం వల్ల ఏపీకి ఒనగూడేది ఏమైనా ఉందా అన్నదే సగటు ఆంధ్రుడి మాట.