Begin typing your search above and press return to search.

మోడీపై బీజేపీ ఎంపీ విమ‌ర్శ‌లు.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   14 May 2022 1:30 PM GMT
మోడీపై బీజేపీ ఎంపీ విమ‌ర్శ‌లు.. రీజ‌న్ ఇదే!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ. ఈసారి నిరుద్యోగ సమస్య, జాతీయ బ్యాంకులు రుణాలు మంజూరు చేసే విధానాలపై ప్రశ్నించారు. కార్పొరేట్లకే బ్యాంకులు 80 శాతం రుణాలు ఇస్తాయని, యువత, రైతులకు మొండి చేయి చూపిస్తాయని విమర్శించారు. ఉత్తర్ప్రదేశ్, బరేలీ జిల్లాలోని బహేరి తహసీల్లో పర్యటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

జాతీయ బ్యాంకులు 80 శాతం రుణాలను బడా పారిశ్రామిక వేత్తలకే అందిస్తాయని, యువత, రైతులను పట్టించుకోవని ఆరోపించారు. సొంత ప్రభుత్వంపైనే మరోమారు విమర్శలు గుప్పించారు. యువత భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.

"రూ.1000 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న పారిశ్రామికవేత్తలకే బ్యాంకులు 80 శాతం రుణాలు ఇస్తాయి. మిగిలిన 20 శాతంలో 11 శాతం రూ.50 కోట్లపైన టర్నోవర్ ఉన్న చిన్న పరిశ్రమలకు అందిస్తాయి.

దేశంలోని యువత, రైతులు, కూలీలకు ఎంత శాతం రుణాలు కేటాయిస్తున్నారనే విషయంపై ఆయా జాబితాలను పరిశీలించగా కీలక విషయాలు తెలిశాయి. కేవలం 9శాతం మాత్రమే లోన్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు యువతకు ఇతర ఉపాధి మర్గాలు ఏమిటి అనేదే పెద్ద ప్రశ్న. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే.'' అని గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు.

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులంతా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని వరుణ్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సమయానికి రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించేందుకు వెళ్లినప్పుడు ఆశ్చర్యపోయానని, కొన్ని చోట్ల అసలు కేంద్రాలే లేవన్నారు.

రైతులు ఏడాదంతా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారని గుర్తు చేశారు. 'యువత భవిష్యత్తుపై ఆందోళనగా ఉంది. 15 ఏళ్ల క్రితం నేను రాజకీయాల్లో చేరినప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు నా ఆందోళన అంతా యువత, వారి భవిష్యత్తుపైనే.' అని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. గ‌తంలోనూ ఈయ‌న మోడీ విధానాల‌పై విమర్శ‌లు గుప్పించారు.