Begin typing your search above and press return to search.

తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి : బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   12 May 2022 4:28 AM GMT
తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి : బీజేపీ ఎంపీ
X
ప్రపంచ వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్ పై మరో వివాదం రాజుకుంది. ఈసారి దాన్ని రాజేసింది దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ కావడం విశేషం. ప్రస్తుత తాజ్ మహల్ ఉన్న స్థలంలో గతంలో హిందూ దేవాలయం ఉండేదని.. తాజ్ మహల్ లోపల ఇప్పటికీ శివలింగం ఉందని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు తాజ్ మహల్ లోని గదుల్లో దేవతా విగ్రహాలు, శాసనాలు దాచబడ్డాయని.. లోపల ఉన్న 22 గదులను తెరవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలైంది.

ఈ వివాదం నడుస్తున్న వేళ అసలు తాజ్ మహల్ ఉన్న స్థలం మొత్తం జైపూర్ రాజవంశీయులదేనని.. గతంలో అక్కడ ఉన్న తమ పూర్వీకుల భవనాలను కూల్చివేసి ఆ స్థలాన్ని ఆక్రమించిన షాజహాన్ అక్కడ తాజ్ మహల్ నిర్మించినట్లు రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దివ్యకుమారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్ రాజవంశానికి చెందిన మూడోతరం మహిళ ఈ దివ్యకుమారీ.

భారతదేశంలో బ్రిటీష్ పాలన సమయంలో జైపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలక మహారాజు అయిన మాన్ సింగ్ 11 మనవరాలు ఈ బీజేపీ ఎంపీ దివ్యకుమారీ. తాజ్ మహల్ నిర్మించిన స్థలంలోనే గతంలో తమ పూర్వీకులకు ప్యాలెస్ ఉండేదని.. ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని నిరూపించే పత్రాలు సైతం తన వద్ద ఉన్నాయని ఎంపీ దివ్యకుమారీ పేర్కొంది.

షాజహాన్ అధికారంలో ఉన్న సమయంలో అతడు ఆ భవనాన్ని బలవంతంగా లాక్కుని భవనాన్ని కూల్చివేసి తాజ్ మహల్ కట్టినట్లు దివ్యకుమారీ చెప్పుకొచ్చారు. అయితే తాజ్ మహల్ ను కూల్చివేయమని తాము చెప్పడం లేదని.. నిజనిజాలు తెలియాలంటే విచారణ జరగాలని ఆమె అన్నారు. ఇటీవల పలు సంఘాల నుంచి వచ్చిన ఆరోపణల ధృవీకరించడానికి విచారణ నిర్వహిస్తేనే అన్ని వాస్తవాలు స్పష్టంగా వెలుగులోకి వస్తాయని ఎంపీ దివ్యకుమారీ తెలిపారు.

నేడు ప్రభుత్వం భూసేకరణ చేపడితే పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆమె చెప్పారు. ‘అప్పట్లో అలాంటి చట్టం లేదని.. అయితే ఈ భూమి జైపూర్ రాజకుటుంబానికి చెందినదని స్పష్టమవుతోంది. ఆ భూమి మాదేనని నిరూపించే పత్రాలు మా వద్ద ఉన్నాయన్నారు. కోర్టు అడిగితే ఆ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యకుమారి పేర్కొన్నారు.

1631-32లో ప్రారంభమైన తాజ్ మహల్ నిర్మాణం 22 ఏళ్ల అనంతరం 1653లో పూర్తయ్యింది. దాదాపు 475 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ పాలరాతి కట్టడం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది.