Begin typing your search above and press return to search.

రంగా పేరుతో క్రిష్ణా జిల్లా...కాపులకు కాషాయం అండ

By:  Tupaki Desk   |   27 Dec 2022 3:49 AM GMT
రంగా పేరుతో క్రిష్ణా జిల్లా...కాపులకు కాషాయం అండ
X
వంగవీటి మోహన రంగారావు. కేవలం మూడున్నర ఏళ్లు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మరణించి మూడున్నర దశాబ్దాలు గడచినా ఇంకా ఆ పేరు కోస్తా జిల్లాలలో మారుమోగుతోంది. రంగా 34 వర్ధంతి వేళ విశాఖలో రంగా రాధా మిత్రమండలి ఆద్వర్యంలో కాపునాడు పేరిట భారీ సభ నిర్వహించారు. ఈ సభకు అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం నాయకులు వస్తారని అంచనాలు ఉన్నా చివరికి వారంతా రాలేదు.

చిత్రంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సభకు హాజరయ్యారు. ఆయనతో పాటు జనసేన నాయకులు కూడా చాలా మంది వచ్చారు. ఇక కాపునాడు సభకు జీవీఎల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన కాపులకు ఆర్హికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్లలో అయిదు శాతం ఇవ్వడానికి రాష్ట్రానికి హక్కులు ఉన్నాయని రాజ్యసభలో ప్రశ్న అడిగి మరీ కేంద్రం చేత స్పష్టం చేయించారు.

అందుకు గానూ ఆయనకు కాపునాడు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఇక కాపుల కోసం బీజేపీ ఉందని వారికి రాజ్యాధికారం దక్కాల్సిందే అని బీజేపీ నేత హోదాలో జీవీఎల్ చెప్పుకొచ్చారు. కాపులను ఓటు బ్యాంక్ గానే వైసీపీ టీడీపీ చూస్తున్నాయని ఆయన విమర్సించారు. కాపులకు ఎందుకు అధికారం దక్కదని ఆయన నిలదీశారు. దేశంలో చాలా రాష్ట్రాలలో అత్యధిక జనాభా ఉన్న వారికే అధికారం దఖలు పడుతూంటే ఏపీలో మాత్రం చిత్రమైన వాతావరణం ఉందని జీవీఎల్ విమర్శించారు.

కాపులకు అండగా బీజేపీ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇక వంగవీటి మోహనరంగా పేరును క్రిష్ణా జిల్లాకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా ఈబీసీ రిజర్వేషనలో కాపులకు అయిదు శాతం ఇవ్వాల్సిందే అని కోరారు. విశాఖ బీచ్ రోడ్డులో రంగా విగ్రహం ఏర్పాటు చేయాలని కూడా జీవీఎల్ కోరారు. కాపులకు రాజ్యాధికారం దక్కాలని, ఆ విషయంలో బీజేపీ తన వంతు పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో మాట్లాడిన జనసేన నాయకుడు శ్రీనివాస్ కాపులకు రిజర్వేషన్ల కంటే ముఖ్యమంత్రి పదవే ముఖ్యమని అన్నారు. తాము అధికారాన్నే కోరుకుంటునామని కాపులకు చిరకాల కోరిక ఆ విధంగా తీరాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అలాగే కాపులు వెనకబడి వర్గాలతోనే కలసి నడుస్తాయని ఆయన చెప్పడం విశేషం.

మొత్తానికి కాపులు రెండు అవకాశాలు గతంలో జారవిడుచుకున్నారని ఈసారి మాత్రం పవన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందే అన్న అజెండా మాత్రం కాపునాడు ఆ సామాజికవర్గం ముందు పెట్టడం విశేషం. వైసీపీ టీడీపీ నేతలు ఈ సమావేశానికి రాకపోవడం చర్చకు తావిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.