Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ కోర్టుకు పీడీ ఖాతాలు..టీడీపీకి చుక్క‌లేనా?

By:  Tupaki Desk   |   11 Aug 2018 4:25 PM GMT
గ‌వ‌ర్న‌ర్ కోర్టుకు పీడీ ఖాతాలు..టీడీపీకి చుక్క‌లేనా?
X
ఏపీ స‌ర్కారు ప‌నితీరుపై బీజేపీ ఎదురుదాడి తారాస్థాయికి చేరుతోంది. ఏపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. 58,418 వ్యక్తిగత ఖాతాలు తెరిచి 53 వేల కోట్లను డిపాజిట్‌ చేశారని ఆయ‌న ఆరోపించారు. ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందన్నారు. 2జీ స్పెక్ట్రమ్‌ - బొగ్గు - కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణాల కంటే ఇది పెద్ద స్కామ్‌ అని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారపై శ్వేతపత్రం ప్రకటించాలని జీవీఎల్‌ నరసింహరావు డిమాండ్‌ చేశారు. కాగా, జీవీఎల్ ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఘాటుగా స్పందిస్తూ రాష్ట్ర పాలనలో పీడీ ఖాతాల నిర్వహణ గురించి అవగాహన లేని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేసి సీజ్ చేసిన సొమ్మును పీడీ అకౌంట్‌ లో ఉంచుతారని వివరించారు. కోర్టు ఖాతాలు కూడా పీడీ రూపంలో ఉంటాయని - జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలు న్యాయస్థానాలను సైతం తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని విమర్శించారు.

ఇలా వాదోప‌వాదాలు కొన‌సాగుతుండ‌గానే...మ‌రో ప‌రిణామం చోటుచేసుకుంది. పీడీ ఖాతాల వివాదం గ‌వ‌ర్న‌ర్ కోర్టుకు చేరింది. గవర్నర్‌ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. పీడీ అకౌంట్స్ లో భారీగా నగదు జమచేయడంపై కాగ్ స్పెషల్ ఆడిట్ - సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ లేఖలో జీవీఎల్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పీడీ అకౌంట్స్ స్కాం జరిగిందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం 58,539 పీడీ అకౌంట్లు తెరిచి రూ.53,038 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం... పీడీ అకౌంట్స్ లో వేసిందని - 2016-17 కాగ్ రిపోర్ట్ చూస్తే ఇదో భారీ కుంభకోణం అనిపిస్తోందన్నారు. ఈ నేప‌థ్యంలో విచార‌ణ జ‌రిపించి నిజాలు నిగ్గుతేల్చాల‌ని జీవీఎల్ డిమాండ్ చేశారు.

కాగా, క‌ర్ణాటక ఎన్నికల సందర్భంగా బీజేపీ- టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వం అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌ని, చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ అవినీతిని బ‌య‌ట పెడ‌తామ‌ని వెల్ల‌డించారు. దీనికి కొన‌సాగింపుగానే పీడీ ఖాతాల అంశాన్ని జీవీఎల్ ఎత్తుకున్నారు. తాజాగా అందుకు త‌గిన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయ‌ని ప‌లువురు అంటున్నారు. కాగా, పీడీ ఖాతాల విషయంలో ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డితే...టీడీపీ బుక్క‌వ‌డం ఖాయ‌మని అంటున్నారు.