Begin typing your search above and press return to search.

ప్రియాంక‌పై కామెంట్లు.. జాబితాలో చేరిన మ‌రో ఎంపీ

By:  Tupaki Desk   |   10 Feb 2019 11:31 AM GMT
ప్రియాంక‌పై కామెంట్లు.. జాబితాలో చేరిన మ‌రో ఎంపీ
X
కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌వ‌డంలో భాగంగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకాగాంధీ నియమితురాలు అవ‌డంపై ప‌లువురు నేత‌లు ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టబోతున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత‌లు త‌మదైన శైలిలో విశ్లేష‌ణ‌లు చేశారు. పూర్వాంచల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు తీసుకోబోతున్నారని కాంగ్రెస్ ప్రకటించాక కొందరు బీజేపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ప్రియాంక అందంగా ఉంటారని, కానీ అందానికి ఓట్లు రాలవని బీహార్ మంత్రి వినోద్ నారాయన్ ఝా అన్నారు. సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్య స్వామి ప్రియాంక ఓ మెంటల్ కేస్ అని క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు.

ఇలా ప్రియాంక గురించి వ్యాఖ్యానించిన వారి జాబితాలో, తాజాగా మ‌రో నేత చేరారు. బీజేపీ ఎంపీ హరీష్‌ ద్వివేది యూపీలోని బస్తీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమలో మాట్లాడుతూ రాహుల్‌ విఫలమైనందునే ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ ఢిల్లీలో జీన్స్‌, టాప్‌ ధరిస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో చీర ధరించి కట్టుబొట్టు పాటిస్తారని వ్యాఖ్యానిస్తారు. ప్రియాంక వ‌స్త్రాధ‌ర‌ణ మార్చిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని....రాహుల్ గాంధీ వ‌లే ఆమె కూడా విఫ‌లం చెందుతార‌ని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉండ‌గా, ప్రియాంక గురించి, ఆమె అందం ప‌లువురు నేతలు శృతిమించిన కామెంట్లు చేశారు. బై పోలార్ డిజార్డర్ అనే రుగ్మతతో ప్రియాంక బాధపడుతున్నారని, ఇది ఆమె హింసాత్మక స్వభావాన్ని తెలియజేస్తుందంటూ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధి ప్రభావంతో ఆమె తన చుట్టూ ఉన్న వారిని కొడుతుంటారని, ఈ రుగ్మతతో బాధపడేవారు ప్రజా జీవితంలో పనిచేయలేరన్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డమే ఒకింత అవాంచ‌నీయ స్థితిలో, అస‌భ్యంగా ఉన్నాయన‌కుంటే..సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నేత‌లు కూడా ఆమె అందం గురించే మాట్లాడారు. అందులో మంత్రి స్థాయిలో ఉన్న‌వాళ్లు కూడా మ‌తిపోగొట్టే కామెంట్లు చేశారు.మధ్యప్రదేశ్‌ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మంత్రి సజ్జన్‌ సింగ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీలో ప్రియాంక లాంటి అందగత్తెలు లేరని, అది వారి దురదృష్టమని వ్యాఖ్యానించారు. బీజేపీలో అందమైన ముఖం ఒక్కటి కూడా లేదంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ``బీజేపీకి ఉన్నది కేవలం హేమామాలిని మాత్రమే. ఆమె చేసే సంప్రదాయ నృత్యాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించి బీజేపీ వాళ్లు కొన్ని ఓట్లు అడగాల్సిందే`` అని ఎద్దేవా చేశారు. ``ప్రియాంకను ఇంత అందంగా సృష్టించినందుకు దేవుడికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రజల పట్ల తనకు గల గౌరవం, ప్రేమను ఆమె సౌందర్యం ప్రతిబింబిస్తుంది. కైలాస్ వర్గీయ తదితర బీజేపీ నేతలు ప్రియాంకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తమ స్థాయిని దిగజార్చుకోకూడదు`` అని వర్మ వ్యాఖ్యానించారు.