Begin typing your search above and press return to search.

చేతి మణికట్టును కోసుకొని బీజేపీ ఎంపీ కోడలు ఆత్మహత్యాయత్నం

By:  Tupaki Desk   |   16 March 2021 9:30 AM IST
చేతి మణికట్టును కోసుకొని బీజేపీ ఎంపీ కోడలు ఆత్మహత్యాయత్నం
X
బీజేపీ ఎంపీ కోడలు ఒకరు ఆత్మహత్యయత్నం చేసుకోవటం సంచలనంగా మారింది. అత్తారింటికి వెళ్లిన కోడలు.. తన చేతి మణికట్టును కోసుకొన్నారు. సకాలంలో విషయాన్ని గుర్తించి.. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించటంతో పెద్ద ముప్పు తప్పింది ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఈ బీజేపీ కోడలు ఆత్మహత్యయత్నం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? భర్తపై సంచలన ఆరోపణలు చేశారెందుకు? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని మోహన్ లాల్ గంజ్ నుంచి కౌశల్ కిశోర్ బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కుమారుడు ఆయుష్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. వారి పెళ్లికి ఎంపీ.. ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో తాను ప్రేమించి పెళ్లాడిన అంకితను లక్నోలో ఒక అద్దెంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల మూడున ఆయనకు బుల్లెట్ గాయాలు అయినట్లుగా సమాచారం బయటకు వచ్చి కలకలం రేపింది. ఈ ఉదంతంపై ఉలిక్కిపడిన పోలీసులు విచారణ జరపగా.. అతడు చెప్పిందంతా అబద్ధమని.. కావాలనే ఇలా చేశాడని తేల్చారు.

అనంతరం అతడ్ని ఆసుపత్రిలో చేర్చగా.. ఉన్నట్లుండి ఎవరికి చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం మండియాన్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి అంకిత మరోలాంటి వాదనను వినిపిస్తోంది. తన భర్త ఆయుష్ తనను మోసం చేశాడని.. అతను ఎప్పటికైనా తిరిగి వస్తారని ఇంతకాలం ఎదురుచూసినట్లుగా పేర్కొన్నారు. ఎంతకూ రాకపోవటంతో ఆమె అత్తారింటికి వెళ్లి.. అక్కడే తన చేతి మణికట్టును కోసుకొన్నారు.

ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో రెండు వీడియోల్ని పోస్టు చేశారు. భర్తపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె కన్నీరు మున్నీరు అవుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తన చావుకు భర్త ఆయుష్.. మామ ఎంపీ కౌశల్ కిశోర్.. అత్త ఎమ్మెల్యే జయదేవి.. మరిది (భర్త సోదరుడు) తన చావుకు బాధ్యులని పేర్కొన్నారు. ఈ ఉదంతం యూపీలో సంచలనంగా మారింది. బలమైన రాజకీయ కుటుంబంలో చోటు చేసుకున్న ఈ అంశం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.