Begin typing your search above and press return to search.

నిజమా?..రాజ్యాంగం రాతప్రతిలో రాములోరి చిత్రాలను నెహ్రూ తొలగించారా?

By:  Tupaki Desk   |   3 Feb 2020 1:07 PM GMT
నిజమా?..రాజ్యాంగం రాతప్రతిలో రాములోరి చిత్రాలను నెహ్రూ తొలగించారా?
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీలు నిజంగానే సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న వ్యాఖ్యలు చేస్తూ పెను కలకలమే రేపుతున్నారు. కాషాయ పార్టీకి చెందిన యువ ఎంపీలు ఈ తరహాలో పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నారని చెప్పాలి. అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీ ఎంపీలైన వీరి నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను కొని తెస్తున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి కోవలోనే వచ్చే మరో వివాదాన్ని బీజేపీకి చెందిన యువ నేత, ఢిల్లీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ రేపారు. మొన్నటికి మొన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పర్వేశ్... తాజాగా ఏకంగా రాజ్యాంగ ప్రతులను చూపుతూ మరో వివాదం రేపారు. రాజ్యాంగం రాతప్రతిలో రాముడు, సీతల చిత్రపటాలుండేవని, వాటిని భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పట్టుబట్టి మరీ తొలగించారని పర్వేశ్ ఆరోపించారు.

సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా పర్వేశ్ ఓ రేంజిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయినా ఈ వివాదంపై ఆయన ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘జైశ్రీరాం నినాదమిస్తే బీజేపీ మతతత్వ పార్టీ అయిపోతుందా?ఈ విషయంలో అడ్డగోటు విమర్శలు చేసే ప్రతిపక్షాలకు నేనో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మన భారర రాజ్యాంగం ఒరిజినల్ కాపీ (రాతప్రతి)లో శ్రీరాముడు, సీతమ్మ వారి చిత్రాలు ఉండేవి. వాటిని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కావాలని తొలగించారు. ఇవాల్టికి కూడా రాజ్యాంగంలో హనుమంతుడు, ఇతర దేవతల బొమ్మలున్నాయి. అంటే మన రాజ్యాంగం కూడా మతపరమైందే అనుకోవాలా?’’ అంటూ పర్వేశ్ తనదైన శైలి సంచలన వ్యాఛ్యలు చేశారు.

విపక్షాల తీరుపై తనదైన రేంజిలో విరుచుకుపడిన పర్వేశ్... సీఏఏ వల్ల దేశంలోని ముస్లింలకు ఎలాంటి ప్రమాదం తలెత్తబోదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేవలం ముస్లింలు కొన్ని సముదాయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకే ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించారని కూడా పర్వేశ్ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. గతంలో అధికారాన్ని వెలగబెట్టి ఇప్పుడు విపక్షానికే పరిమితమైన పార్టీలు చేసిన చారిత్రక తప్పులను తమ ప్రభుత్వం సరిచేస్తున్నదని చెప్పిన పర్వేశ్... దేశం పట్ల తమ వైఖరి వల్లే ప్రతిపక్షాలు నానాటికీ కుంచించుకుపోతున్నాయని కూడా సెటైర్ సంధించారు.