Begin typing your search above and press return to search.

బీజేపీ మ‌హిళా ఎంపీని రైల్లో ఇలా వేధించార‌ట‌

By:  Tupaki Desk   |   3 Oct 2017 4:45 AM GMT
బీజేపీ మ‌హిళా ఎంపీని రైల్లో ఇలా వేధించార‌ట‌
X
మ‌నుషుల‌మ‌ని మ‌రిచి...సిగ్గువిడిచి...రాక్ష‌స‌త్వం ప్ర‌ద‌ర్శించి.... ముంబై రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట ఘటన సందర్భంగా బాధితులకు సహాయం చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి అదే అదునుగా ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామం అంద‌రినీ షాక్‌ కు గురిచేసింది. అంతేకాకుండా సిగ్గుతో త‌ల‌దించుకునేలా చేసింది. అయితే ఈ అమాన‌వీయ ఘ‌ట‌న‌పై మ‌హారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ పూనమ్‌ మహాజన్ సంచ‌ల‌న సమాచారాన్ని పంచుకున్నారు. బీజేపీ నేత ప్రమోద్‌ మహాజన్‌ కుమార్తె అయిన పూనమ్ అహ్మదాబాద్‌ లోని ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌(ఐఐఎం)లో నిర్వహించిన రెడ్‌ బ్రిక్‌ సదస్సులో ప్రసంగిస్తూ....దేశంలోని మహిళలు ఎప్పుడోసారి లైంగిక వేధింపుల బారిన పడిన వారేనని, తానూ అతీతురాలిని కాదని చెప్పారు.

``చ‌దువుకునే రోజుల్లో కారులో వెళ్లే స్థోమత లేదు. ఆనాడు వెర్సోవా నుంచి వోర్లి వరకు రోజూ రైల్లో ప్రయాణించేదానిని.. ఆ సమయంలో కొంత మంది నన్ను అసభ్యకరంగా చూసేవారు. అది చాలా ఇబ్బందిక‌రంగా ఉండేది. కానీ, వారిని నేను పట్టించుకునేదాన్ని కాదు. నా ల‌క్ష్యంపై గురిపెట్టి ముందుకు సాగేదాన్ని`` అని ఎంపీ పూనమ్ వివ‌రించారు. ``భారత్‌ లో మహిళలను దేవతా మూర్తులుగా కొలుస్తాం. కొన్ని విషయాల్లో అమెరికానూ మించిపోయాం. ఇప్పటికీ అమెరికాకు ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేదు. అది భారత్‌లోనే సాధ్యపడింది. అంతేకాకుండా రక్షణ శాఖ - ముఖ్యమంత్రులు ఇలా ఎంతో మంది మహిళలు మన దేశంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం బాధాక‌రం``అని పూనమ్‌ అన్నారు. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ అన్నారు.

కాగా, మ‌హిళ‌పై అఘాయిత్యానికి పాల్ప‌డిన వీడియోకు సంబంధించి దాదర్ పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం కోసం సీసీటీవీ ఫుటేజీలు - స్థానికుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ``తొక్కిసలాట కేసులో ఇప్పటివరకు 35 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించాం. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపైనా విచారణ జరుపుతున్నాం. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నాం. అతడు దొరికితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి`` అని ఐదో జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజీవ్‌ జైన్ తెలిపారు.