Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ సతీమణి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదేమంటే..

By:  Tupaki Desk   |   13 Aug 2016 6:33 AM GMT
ఆ ఎంపీ సతీమణి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదేమంటే..
X
పదవిలో ఉంటే ఎలాంటి పనులైనా జరిగిపోవటం తెలిసిందే. ప్రజాప్రతినిధులు.. వారి కుటుంబ సభ్యులు తమకునన పవర్ ను ఎంతలా వాడేసుకుంటారో ఇప్పటికే చాలా ఉదంతాలు ఉన్నాయి. ఆ మధ్యన యూపీ మంత్రి అజాంఖాన్ ఇంట్లో పశువు ఒకటి పోతే.. దాన్ని పట్టుకోవటానికి పోలీసులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి.. ఆగమాగం చేసి మరీ చివరకు ఆ పశువు జాడ వెతికి పట్టుకోవటం తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతం మీడియాలో పెద్ద ఎత్తున రావటం.. విమర్శలు వెల్లువెత్తినా పెద్దగా పట్టించుకున్నది లేదు.

పోలీస్ యంత్రాంగం మొత్తం మంత్రిగారి మిస్ అయిన పశువును వెతికి పట్టుకోవటం తెలిసిందే. తాజాగా యూపీ పోలీసుల నెత్తిన మరో పెద్ద బాధ్యతే పడింది. ఒక ఎంపీగారి కుక్క మిస్ అయ్యింది. ఇప్పుడా కుక్కను వెతికి పట్టుకునే పని పోలీసుల నెత్తిన పడింది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ఆగ్రా ఎంపీ.. బీజేపీ నేత రాంశంకర్ కథిరియా పెంపుడు కుక్క మిస్ అయిన విషయాన్ని ఆయన సతీమణి మృదుల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కుక్క మిస్సింగ్ గురించి ఫిర్యాదు చేసేందుకు కొద్దిమంది నేతల్ని వెంటేసుకొచ్చిన ఆమె.. తమ కుక్క మిస్ అయ్యిందని.. దాన్ని వెతికి పెట్టాలని కోరారు.

గుర్తు తెలియని దుండగులు వచ్చి తామెంతో అల్లారు ముద్దుగా పెంచుకునే కుక్కను ఎత్తుకెళ్లిపోయారని వెల్లడించారు. నల్ల రంగులో ఉండే లాబ్రడర్ జాతికి చెందిన ఈ కుక్క అరుదైనదని.. ఇది తమ ఫ్యామిలీలో ఒక మెంబర్ అని.. దాని ఆచూకీ తెలుసుకునేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. ఇలా మంత్రి గారి పశువులు మిస్ అయితే. ఎంపీగారి మిస్సింగ్ కుక్కల్ని వెతుకుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించేవారెవరు..?