Begin typing your search above and press return to search.

ఎంపీ అరవింద్ సంచలనం.. నెక్ట్స్ సీఎం కేటీఆరా? సంతోషా?

By:  Tupaki Desk   |   9 July 2020 5:30 AM GMT
ఎంపీ అరవింద్ సంచలనం.. నెక్ట్స్ సీఎం కేటీఆరా? సంతోషా?
X
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టి టీఆర్ఎస్ ను గురిపెట్టారు. ‘పట్టాభిషేకం సంతోష్ కా? కేటీఆర్ కా?’ అంటూ ఆయన పెట్టిన పోస్టుపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రెండు వారాలుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించట్లేదని.. ఆయన ఆరోగ్యంపై వివరణ ఇవ్వాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఈ పోస్టు చర్చనీయాంశమైంది.

ఇన్నాళ్లు టీఆర్ఎస్ లో నంబర్ 2గా ఉన్న హరీష్ రావును చాకచక్యంగా పక్కనపెట్టి తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు సడన్ గా కేసీఆర్ కు నమ్మినబంటు అయిన సడ్డకుడి కొడుకు సంతోష్ కుమార్ తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

నిజానికి కేంద్రంలో ఈసారి హంగ్ వస్తే కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకు వెళ్లి కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికలను కేసీఆర్ అందుకే నిర్వహించారన్న ప్రచారం సాగింది.కానీ కేంద్రంలో బీజేపీ క్లియర్ కట్ మెజార్టీ రావడంతో కేసీఆర్ ఆశలు నెరవేరలేదంటారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కేటీఆర్ కీరోల్ పోషిస్తూ వస్తున్నారు. పోటీ అయిన హరీష్ రావును పూర్తిగా పక్కనపెట్టారంటారు.

అయితే ఇప్పుడు హరీష్ రావు సైడ్ అయిపోగా.. తెరపైకి కేటీఆర్ సోదరుడు సంతోష్ రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ పీఏగా మొదలైన సంతోష్ ప్రస్థానం ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. రాజ్యసభ ఎంపీగా సాగింది. పార్టీకి, కేసీఆర్ కు మధ్య వారధిగా సంతోష్ మారిపోయారు. కేసీఆర్ వెంటే ఎక్కడికెళ్లినా ఉంటారు. ఇప్పుడు సంతోష్ తప్పకుండా కేటీఆర్ కు పోటీ అని.. కేసీఆర్ బాగా మెచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దీనికి బలాన్ని ఇస్తూ తాజాగా జున్వాడ కేటీఆర్ ఫాంహౌస్ అక్రమమని లీకులు ఇచ్చిందని సంతోష్ రావేనని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కేసీఆర్ ఎక్కువగా సంతోష్ కు ప్రాధాన్యం ఇస్తున్నారని... అందుకే కేసీఆర్ కుటుంబంలో ఈ ఆధిపత్య పోరు నడుస్తోందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఎంపీ అరవింద్ తాజాగా పట్టాభిషేకం కేటీఆర్ కా? సంతోష్ కా అన్న వాదన తెరపైకి తెచ్చి ఉంటాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.