Begin typing your search above and press return to search.

టీటీడీకి బీజేపీ సీనియర్ ఎంపీ కితాబు.. భేష్ అని ప్రశంస!

By:  Tupaki Desk   |   10 Aug 2019 6:21 AM GMT
టీటీడీకి బీజేపీ సీనియర్ ఎంపీ కితాబు.. భేష్ అని ప్రశంస!
X
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రస్తుత పాలనా వ్యవహారాలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. టీటీడీని ఆయన ప్రశంసించారు.

గతంలో సుబ్రమణ్యం స్వామి టీటీడీ వ్యవహారాలపై పలుసార్లు కోర్టుకు ఎక్కారు. స్వామి వారి ఆలయ గోడలను బంగారు తాపడం చేయాలని గతంలో టీటీడీ ప్రయత్నించింది. ఆ విషయంలో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. వారిలో సుబ్రమణ్యస్వామి కూడా ఉన్నారు.

టీటీడీ నిర్ణయంపై ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బంగారుతాపడం చేయడం వల్ల ఆలయ నిర్మాణానికి సంబంధించిన మూలాలు దెబ్బతింటాయని, ఆలయ గోడలపై శతాబ్దాల క్రితం చెక్కిన అక్షరాలు, నాటి రాజులు రాయించిన శాసనాలు మాయం అవుతాయని స్వామి పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులతో టీటీడీ అప్పుడు వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

ఇక ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి నియామకాన్ని సుబ్రమణ్యస్వామి సమర్థించారు. సుబ్బారెడ్డి మతం విషయంలో కొందరు దుష్ప్రచారానికి పాల్పడగా, ఆ విషయంలో స్వామి ఘాటుగా స్పందించారు. సుబ్బారెడ్డి పక్కా హిందూ అని ఆయన నియామకం విషయంలో అభ్యంతరాలు వద్దని స్వామి ట్విటర్లో స్పందించారు కూడా.