Begin typing your search above and press return to search.

'మీటూ' దుర్వినియోగంపై బీజేపీ ఎంపీ కామెంట్స్!

By:  Tupaki Desk   |   16 Oct 2018 11:43 AM GMT
మీటూ దుర్వినియోగంపై బీజేపీ ఎంపీ కామెంట్స్!
X
ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా `#మీటూ` ఉద్య‌మంపై చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెల‌సిందే. గ‌తంలో తామూ లైంగిక వేధింపుల‌కు గుర‌య్యామంటూ దాదాపుగా అన్ని రంగాల‌కు చెందిన మ‌హిళ‌లు త‌మ గొంతెత్తుతున్నారు. తమపై గతంలో జరిగిన లైంగిక దాడులను ఎంతో మంది సినీతారలు, జర్నలిస్టులు ఇతరులు 'మీటూ' అంటూ బయటపెడుతున్న సంగతి తెలిసిందే. తాము లైంగిక దాడులకు గురయ్యామని గతంలో జరిగిన చేదు అనుభవాలను తెలియజేస్తున్నారు. కాగా ఈ 'మీటూ' ఉద్యమంపై ఢిల్లీకి చెందిన భాజపా ఎంపీ ఉదిత్‌ రాజ్ ఆస‌క్తిక‌రం వ్యాఖ్యలు చేశారు. భారత్ లో 'మీటూ' ఉద్యమాన్ని కొంద‌రు మ‌హిళ‌లు తప్పుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని తాను కూడా ఒప్పుకుంటాని కానీ, కొంద‌రు మ‌హిళ‌లు ఆ ఉద్య‌మాన్ని త‌ప్పుగా ఉప‌యోగించుకుంటున్నార‌ని అన్నారు.

ఈ ఉద్య‌మాన్ని అడ్డం పెట్టుకుని కొంద‌రు మ‌హిళ‌లు...బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. లైంగిక వేధింపులు, రేప్ జ‌రిగిన ప‌దేళ్ల‌కు మీడియా ముందుకు రావ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఈ ఉద్యమాన్ని కొంద‌రు మ‌హిళ‌లు త‌ప్పుగా ఉప‌యోగించుకోవ‌డం వ‌ల్ల ...కొంద‌రు పురుషుల జీవితాలు నాశ‌నం అవుతున్నాయ‌న్నారు. ఆ ఉద్యమం ముఖ్యమైనదేన‌ని, కానీ లైంగిక వేధింపులు, రేప్ జ‌రిగిన పదేళ్ల తర్వాత ఆరోపణలు చేయాల్సిన సందర్భం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇంత కాలం తర్వాత చేస్తోన్న ఆరోపణల్లో నిజానిజాలను ఎలా నిరూపిస్తారని ప్ర‌శ్నించారు. ప్రస్తుతం ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రతిష్ఠ ఎంత దెబ్బ తింటుందో ఆలోచించాల‌న్నారు. ఓ మహిళ గతంలో ఓ వ్యక్తితో సహజీవనం చేసి.. ఆ తర్వాత అత్యాచార ఆరోపణలు చేయ‌డం స‌బ‌బేనా అని ప్ర‌శ్నించారు. ఆ నెపంతో అత‌డిని ఆమె జైలుకు పంపిస్తే అది బెదరించినట్లు కాదా అని ఆయ‌న‌ ప్రశ్నించారు. `మీటూ`ను కొంద‌రు మ‌హిళ‌లు దుర్వినియోగం చేస్తున్నార‌ని చెప్ప‌డ‌మే త‌న ఉద్దేశ్య‌మ‌ని...ఆయ‌న చెప్పారు. మ‌హిళ‌ల‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌య‌ట‌పెట్టాల్సిందేన‌ని కానీ, కొంద‌రు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి అస‌లు ఉద్య‌మాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని అన్నారు.

అయితే, న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీనిపై ఆయ‌న కూడా స్పందించారు. అన్నిరంగాల్లో ఇది ఉంటుంద‌ని, సినిమానే టార్గెట్ చేయొద్ద‌ని అంటూ... ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవ‌డం మంచిదని అంటున్నారు. మీటూ కి మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌పంచ‌మే ఇపుడు దీనికి వ్య‌తిరేకంగా మ‌రో ఉద్య‌మం మొద‌లుపెడుతోంది. ఇది మెల్ల‌గా దుర్వినియోగం అవుతుండ‌టమే దీనికి కార‌ణం.