Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై దుష్ప్రచారం... బీజేపీ ఎంపీలు అడ్డంగా బుక్కైనట్టే

By:  Tupaki Desk   |   22 Sep 2020 2:30 AM GMT
కేసీఆర్ పై దుష్ప్రచారం... బీజేపీ ఎంపీలు అడ్డంగా బుక్కైనట్టే
X
తెలంగాణలో ఇప్పుడు అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ ల మధ్య జరిగే యుద్ధం కంటే కూడా.. టీఆర్ఎస్, బీజేపీల మధ్య సాగుతున్న యుద్ధమే కీలకంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న పోరే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పై తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలిపోయింది. అది కూడా వేరెవరో చెప్పడం కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారే ఈ మాటను తేల్చేసింది. అంటే మొత్తంగా... తన ఎంపీలను కేసీఆర్ సర్కారు ముందు బీజేపీ సర్కారే దోషులుగా నిలబెట్టేసిందన్న మాట. అదెలాగో చూద్దాం పదండి.

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలి నాళ్లలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు స్వయంగా సీఎం హోదాలో కేసీఆరే రంగంలోకి దిగారు. నిత్యం కరోనా విస్తృతిపై సమీక్షలతో పాటు మీడియాకు సమాచారం చేరవేసే బాధ్యతలను కూడా కేసీఆరే స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణ చర్యల పట్ల మోదీ సర్కారు కూడా ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా అన్ని రాష్ట్రాలకు కరోనా పోరు కోసం నిధులిస్తున్నట్లుగానే తెలంగాణకు కూడా నిదులిస్తున్నట్లుగా కూడా మోదీ సర్కారు ప్రకటించింది. చెప్పినట్లుగానే తెలంగాణకు నిధులు కూడా మంజూరు చేసింది.

ఇక్కడే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు.. ప్రత్యేకించి ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు కేసీఆర్ సర్కారును టార్గెట్ చేసేందుకు యత్నించారు. కరోనాపై పోరు కోసం తెలంగాణకు కేంద్రం ఏకంగా రూ.7 వేల కోట్లు ఇస్తే... వాటిని కేసీఆర్ సర్కారు ఏం చేసిందని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ ఎంపీలు తమపై విసురుతున్న విమర్శలను కాస్తంత ఓపిగ్గానే విన్న కేసీఆర్ సర్కారు.. వారిపైకి ఎదురు దాడికి అయితే దిగలేదు. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సోమవారం నాడు అసలు కరోనాపై పోరు కోసం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులెంత అన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ఈ విషయంపై క్లిస్టర్ క్లియర్ ప్రకటన చేసింది. కరోనాపై పోరుకు తెలంగాణకు మొత్తంగా రూ.290 కోట్లు (2019-20 ఏడాదిలో రూ.33. 40 కోట్లు, 2020-212 ఏడాదిలో ఈ నెల 10 వరకు రూ.256.89 కోట్లు) విడుదల చేసినట్లు ప్రకటించింది. దీంతో... కేసీఆర్ సర్కారుపై బీజేపీ ఎంపీలు చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని సాక్షాత్తు మోదీ సర్కారే తేల్చేసిందన్న మాట.