Begin typing your search above and press return to search.

వన్ మేన్ షో..చాలు మోడీ అంటున్న బీజేపీ నేత‌

By:  Tupaki Desk   |   14 Dec 2017 10:30 AM GMT
వన్ మేన్ షో..చాలు మోడీ అంటున్న బీజేపీ నేత‌
X
నటుడు - బీజేపీ నాయకుడు శతృఘ్న సిన్హా మ‌రోమారు తన మాటల తుపాకీని పేల్చారు. గ‌తంలో పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ స‌హా మోడీ తీసుకున్న ఇత‌ర‌త్రా నిర్ణ‌యాలను తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన సిన్హా ఇటీవ‌ల‌ ఏకంగా కేంద్ర కేబినెట్‌ పైనే విరుచుకుప‌డ్డారు. మోడీ ప్రభుత్వ మంత్రివర్గాన్ని భజన బృందంగా అభివర్ణించారు. 90 శాతం మంది మంత్రులు ప్రజలకు తెలియదని - వారు నిర్మాణాత్మక - సృజనాత్మకమైన పనులు చేయడం లేదన్నారు. వారు కేవలం తమ పదవులను కాపాడుకునే పనిలో తీరికలేకుండా ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏక వ్యక్తి కేంద్రంగా - పార్టీ ఇద్దరు వ్యక్తుల ప్రదర్శనగా మారిపోయాయని ఆయన విమర్శించారు. దీనికి కొన‌సాగింపుగా ఈ ద‌పా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పై పంచ్‌ ల‌ వ‌ర్షం కురిపించారు.

గుజ‌రాత్‌లో మాట్లాడుతూ ‘వన్ మేన్ షో - టు మెన్ ఆర్మీ’కి విజ్ఞప్తి. ఇక ఎన్నికల ప్రచారం ముగించి ఢిల్లీకి చేరుకుంటే మంచిది. అధికారం కోసం మీరు పన్నిన మాయోపాయాలు - తంత్రాలు - తప్పుడు ప్రకటనలు - నెరవేర్చలేని హామీలతో ఇప్పటికే విసిగిపోయాం’ అంటూ నరేంద్ర మోడీ - అమిత్ షాను ఉద్దేశించి ‘వన్ మేన్ షో (మోడీ) - టు మెన్ ఆర్మీ (అమిత్ షా)కు అత్యంత మర్యాద పూర్వకమైన విజ్ఞప్తి. ఇకనైనా ఢిల్లీకి చేరుకోండి. మీ ఎన్నికల ప్రచారాలతో విసిగిపోయాం. గుజరాత్‌ లో విజయం కోసం అక్కడున్న మంత్రులు - సిట్టింగులు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు’ అంటూ శతృఘ్న సిన్హా చిత్రమైన ట్వీట్ చేశారు.

గుజ‌రాత్‌లో గెలుపును సైతం సిన్హా చిత్రంగా విశ్లేషించారు. ‘ఒకవేళ మనం గెలిస్తే - ఆ క్రెడిట్ అంతా మీకు దక్కుతుంది. పొరబాటున ఒడిపోతే.. దానికి బాధ్యత తీసుకునే వాళ్లు ఎవరు?’ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఓ పాత సామెతను గుర్తు చేస్తూ ‘అదృష్టం బావుంటే చప్పట్లు మనవే అవుతాయి’ అని ట్వీట్‌ లో కోట్ చేశారు. పార్టీలో శతృఘ్న ప్రాధాన్యత తగ్గినప్పటి నుంచీ - బీజేపీ నాయకత్వంపై సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు ఏలుబడి సాగించిన గుజరాత్‌ లో పార్టీ అననుకూల పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో - నరేంద్ర మోడీ - అమిత్ షాలు అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

మంగళవారం సాయంత్రానికి రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మలిదశలో భాగంగా 93 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ డిసెంబర్ 18న నిర్వహిస్తారు. 1995 నుంచీ నిరంతరంగా బీజేపీ గుజరాత్‌ లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.