Begin typing your search above and press return to search.

త్వరలో బీజేపీ సంపూర్ణ దక్షిణ భారత యాత్ర ప్రారంభం?

By:  Tupaki Desk   |   28 May 2019 1:18 PM GMT
త్వరలో బీజేపీ సంపూర్ణ దక్షిణ భారత యాత్ర ప్రారంభం?
X
దేశంలో బీజేపీ విస్తరణను పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలోనే వెనుకబడి ఉండడం కనిపిస్తుంది. దక్షిణ భారతంలోనూ కర్ణాటకలో ఆ పార్టీ భారీగా సీట్లు సాధించింది. కానీ, ఏపీ - తమిళనాడు - కేరళలో మాత్రం ఈ ఎన్నికల్లో బోణీ చేయలేకపోయింది. అయితే... 2024 ఎన్నికల్లో ఆ లోటు కూడా భర్తీ చేసుకుని దేశం మొత్తం కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ తపిస్తోంది. తాజాగా ఆ పార్టీ వ్యూహకర్తల్లో ఒకరైన సునీల్ దేవదర్ ఆ సంగతి బయటపెట్టారు. అంతా ఘన విజయంగా అభివర్ణిస్తున్న తాజా విజయం బీజేపీకి ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వలేదని - దక్షిణాది రాష్ట్రాల్లో తాము ప్రాబల్యం చూపలేకపోవడం ఇంకా లోటేనని ఆయనంటున్నారు. అందుకే దక్షిణాదిలోనూ పట్టు పెంచుకుని 2024లో దేశవ్యాప్తంగా బీజేపీ సొంతంగా 333 సీట్లు దక్కించుకునేలా కదులుతున్నామన్నారు.

2014 మాదిరిగా ఈసారీ ఉత్తరాదిలో సత్తా చాటిన బీజేపీ కొత్తగా పశ్చిమ బెంగాల్‌ లో గణనీయంగా సీట్లు పెంచుకుంది. ఒడిశాలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లుసాధించింది. తెలంగాణలోనూ 4 సీట్లు సాధించింది. కానీ.. ఏపీ - తమిళనాడు, కేరళలో మాత్రం ఒక్కసీటు కూడా సాధించలేకపోయింది. దీంతో 2024 టార్గెట్ రీచ్ కావడం కోసం త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి - ఏపీ - త్రిపుర ఇంచార్జీ సునీల్ దేవధర్ అంటున్నారు.

ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. తెలుగు నేర్చుకుంటున్నానని.. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలంటే అక్కడి భాష నేర్చుకోవడం అత్యవసరమని సునీల్ చెప్పారు. త్రిపుర - బెంగాల్‌ లో వర్క్ చేసినప్పుడు అక్కడి భాషలు నేర్చుకున్నానని..బెంగాలీలో పీజీ కూడా చేశానని ఆయన చెప్పారు.

దక్షిణాదిలో పార్టీ పరాజయానికి కారణమేంటనే అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్న ఆ పార్టీ బెంగాల్ తరహాలో గ్రిప్ చేయాలని అనుకుంటోంది. 2014లో బెంగాల్‌ లో బీజేపీ 2 సీట్లు గెలుచుకుంటే .. ఇప్పుడు 18 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. బెంగాల్ మాదిరిగానే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే ఈ సారి తమ పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తామని .. భాగస్వామ్య పక్షాల కోసం కాదని సంకేతాలిచ్చారు. త్వరలో కేరళ సహా ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో తమ కార్యాచరణ ప్రారంభమవుతుందని సునీల్ తేల్చిచెప్పారు. దీంతో ఏపీలో జగన్ పార్టీకి టీడీపీ బెడద లేకపోయినా కొత్తగా బీజేపీతో రగడ మొదలవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.