Begin typing your search above and press return to search.
బాబు కష్టం బీజేపీ కష్టం కానే కాదన్నమాట
By: Tupaki Desk | 8 Aug 2017 5:57 AM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో దోస్తీ నడుపుతున్న బీజేపీ తన బంధాన్ని అవసరం మేరకే వాడుకుంటోందా? బాబుకు మైలేజీ తెచ్చే విషయాల్లో తాము కష్టపడాల్సిన అవసరం లేదని....ఇంకా చెప్పాలంటే బాబు కష్టం తమ కష్టం కానే కాదనే భావనలో కమళనాథులు ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నికలు ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. ఏపీలో - జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో కలసి పనిచేస్తున్నప్పటికీ కీలకమైన నంద్యాల ఉప ఎన్నికలో ఉమ్మడి ప్రచారం కనిపించడం లేదు. నంద్యాల ఉప ఎన్నికలో ఇప్పటివరకూ మంత్రులు - టీడీపీనేతల ప్రచారమే తప్ప, అందులో మిత్రపక్షమైన బీజేపీ పాల్గొనకపోవడం చర్చనీయాంశమయింది.
నంద్యాల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ సైన్యం మోహరించిన సంగతి తెలిసిందే. మంత్రులు మొదలుకొని పార్టీ సీనియర్ల వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇప్పటికే ఒక దఫా ప్రచారం నిర్వహించేశారు. త్వరలో ఆయన బావమరిది - సినీనటుడు బాలకృష్ణ కూడా ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలు చాలు నంద్యాల ఉప ఎన్నిక అధికార పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పడానికి. అయితే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో ఎక్కడా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో సఖ్యత విషయంలో పరిపాలన వరకే తమ దోస్తీ తప్ప ఆయన రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని అంటున్నారు. అందుకే నంద్యాల ఉప పోరు ప్రచారానికి దూరంగా ఉన్నారని విశ్లేషిస్తున్నారు.
కాగా, బీజేపీ నేతల సమాచారం ప్రకారం ఇప్పటివరకూ టీడీపీ నాయకత్వం అధికారికంగా బిజెపిని ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానించలేదని తెలుస్తోంది. బీజేపీ నాయకత్వాన్ని అధికారికంగా టీడీపీ ఇప్పటివరకూ ప్రచారానికి ఆహ్వానించలేదని, అలాంటిది ఉంటే తాము తప్పకుండా ప్రచారానికి వెళతామని పార్టీ వర్గాలు అంటున్నాయి. నంద్యాలలో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న వైశ్య వర్గంలో పట్టున్న బీజేపీ సహాయం కోసం టీడీపీ ఎదురుచూస్తోందని అంటున్నారు.