Begin typing your search above and press return to search.

పార్లమెంటు గొడవలో బీజేపీ పాత్రలేదా ?

By:  Tupaki Desk   |   12 Aug 2021 4:30 PM GMT
పార్లమెంటు గొడవలో బీజేపీ పాత్రలేదా ?
X
రాజ్యసభలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు సభ్యుల ప్రవర్తనపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు చాలా బాధపడిపోయారు. సభలో నిరసనలు తెలపటం, పోడియం దగ్గర ఉన్నతాధికారులు కూర్చునే బెంచీలపైకి ఎక్కి సభ్యులు గోల చేయటంపై వెంకయ్య కంటతడి పెట్టారట. మంగళవారం సభ్యుల ప్రవర్తనపై ఛైర్మన్ కు నిద్ర కూడా పట్టలేదట. పార్లమెంటుకు గర్భగుడి లాంటి టేబుల్ ప్రాంతంలో సభ్యుల ప్రవర్తన వల్ల మకిలి అంటిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తన వల్ల పార్లమెంటు విలువ కోల్పోతోందన్నారు.

ఎంపీలు తమ ప్రవర్తన ద్వారా ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఉండాలో లేకపోతే పనికిమాలిన విచ్చినకారులుగా ఉండాలో తేల్చుకోమని సలహా ఇచ్చారు. నిజమే వెంకయ్య వేధన, ఆవేదనలో వాస్తవముంది. సభలో జరిగిన అల్లర్లకు కేవలం ప్రతిపక్షాలదే బాధ్యతగా వెంకయ్య తేల్చేయడం ఆశ్చర్యంగా ఉంది. రెండు చేతులు కలిస్తేనే తప్పట్లన్న విషయం ఛైర్మన్ కు తెలీదేమీకాదు. సభలో జరిగిన గొడవల్లో ప్రతిపక్షాలది ఎంతతప్పుందో అధికారపార్టీదీ అంతే తప్పుందని వెంకయ్యకు తెలీదా ?

అసలు పార్లమెంట్ లో గొడవ ఎందుకు జరిగింది ? ఎప్పుడు మొదలైంది ? పెగాసస్ సాఫ్ట్ వేర్ తో ప్రతిపక్ష నేతల, దేశంలోని ప్రముఖుల మొబైళ్ళను కేంద్రం ట్యాపింగ్ చేస్తోందనే ఆరోపణలతో వివాదం మొదలైంది. తమ ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి ట్యాపింగ్ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మోదీ హయాంలో ఈ ట్యాపింగ్ అన్నీ సరిహద్దులను దాటేసిందనేది ప్రతిపక్షాల ఆరోపణలు.

ప్రతిపక్షాల డిమాండ్ ను మోడీ అసలు పట్టించుకోలేదు. వాళ్ళు ఎంత అరిచి గీపెట్టినా ప్రధాని లెక్కచేయలేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ప్రతిపక్ష నేతలు, ప్రముఖులపై ఉపయోగించకపోతే అదే విషయాన్ని మోదీ ధైర్యంగా సభలో సమాధానం చెప్పచ్చు కదా. సమాధానం చెప్పకపోవటం మోడి తప్పుకాదా ? పెగాసస్ పై జాయింట్ పార్లమెంట్ కమిటితో విచారణ చేయించాలన్న డిమాండ్ ను కూడా మోడీ పట్టించుకోలేదు. ఇదే బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇంతకన్నా ఎక్కువ గొడవే చేసింది వాస్తవం కాదా ?

2జీ స్పెక్ట్రమ్ లో అవినీతని, రక్షణ శాఖ ఉత్పత్తుల కొనుగోళ్ళలో అక్రమాల ఆరోపణలతో అప్పట్లో బీజేపీ సభలో నానా గోల చేసింది. అప్పట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉభయ సభల్లో సమాధానాలు ఇచ్చినా బీజేపీ సంతృప్తి చెందలేదు. విచారణ కమిటి వేసేంతవరకు వదల్లేదు. అప్పుడు కూడా చాలారోజులు సభా సమయం వృధా అయ్యింది. అప్పట్లో బీజేపీ గొడవ చేసినపుడు ఇపుడు ఛైర్మన్ స్ధానంలో కూర్చున్న వెంకయ్య కూడా సభలో ఉన్నారు. మరప్పుడు తాము చేసింది తప్పని తెలీదా ?

బీజేపీ తీరు ఎలాగుంటుందంటే ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగ, అధికారంలోకి వస్తే మరోలా ఉంటుంది. అందుకనే అప్పుడు సభలో గోల చేసిన వెంకయ్య అండ్ కో ఇపుడు బాధపడాల్సిన అవసరం లేదు. పార్లమెంటు అపవిత్రమైపోయిందని ఇపుడు కంటతడి పెట్టడంలో అర్ధమేలేదు. ప్రతిపక్షాలు డిమాండ్లకు మోదీ సమాధానం చెప్పకపోవటం ప్రభుత్వం తప్పే కదా. పార్లమెంట్ లో గొడవలు జరగకూడదని అనుకుంటే అందుకు చొరవ చూపాల్సింది ముందు అధికారపక్షమే. ప్రతిపక్షాల డిమాండుకు సమాధానం చెప్పమని చైర్మన్ హోదాలో మోడిని ఆదేశించలేరా ? కాబట్టి అల్లర్లకు ప్రతిపక్షాలది ఎంత తప్పో అధికారపార్టీది అంతే తప్పుంది.