Begin typing your search above and press return to search.

35 శాతం ఓటు బ్యాంకుపై బీజేపీ క‌న్ను.. సాధ్య‌మేనా?

By:  Tupaki Desk   |   29 Aug 2022 10:30 AM GMT
35 శాతం ఓటు బ్యాంకుపై బీజేపీ క‌న్ను.. సాధ్య‌మేనా?
X
తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేందుకు.. బీజేపీ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌స్తుతంత‌మ‌కు 20 శాతం ఓటు బ్యాంకు ఉంద‌ని.. మ‌రో 15 శాతం ఓటుబ్యాంకును కైవ‌సం చేసుకుంటే.. అంటే.. 35 శాతం ఓటు బ్యాంకును తెచ్చుకుని అధికారంలోకి రావ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని.. పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు సాధ్యం. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. లేక, వ‌చ్చే ఏడాది జ‌రిగినా.. దీనిని సాధిస్తామ‌ని వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నా.. ఇది ఎంత వ‌ర‌కు సాధ్య‌మేనేది.. ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న కీల‌క విష‌యం.

ఎందుకంటే.. రాష్ట్రంలో సెటిల‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా.. మైనారిటీ వ‌ర్గాల ప్ర‌భావం ఉన్న నియోజ క‌వ‌ర్గాల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్‌కు, ఎంఐఎంకు ఉన్న ఇమేజ్‌ను తోసిరా జ‌ని.. బీజేపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయం కాదు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాలు స‌హా సికింద్రాబాద్‌, హ‌య‌త్‌న‌గ‌ర్‌, లింగం ప‌ల్లి, ఎల్బీన‌గ‌ర్ వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో.. సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు.

వీటికితోడు.. పాత‌బ‌స్తీ స‌హా.. ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్‌,క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లోని దాదాపు 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో మైనారిటీల ఓటు బ్యాంకుబ‌లంగా ఉంది. ఇక‌, 31 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్సీ, ఎస్టీ బ‌ల‌మైన ఓటు ఉంది. దీనిని ఒడిసి ప‌ట్టుకోవ‌డం.. బీజేపీకి అంత ఈజీకాదు.

అంతేకాదు.. ఆయా వ‌ర్గాల్లో నెల‌కొన్న అసంతృప్తికి కార‌ణం.. కేంద్ర ప్ర‌భుత్వ‌మేన‌ని.. అందునా.. మోడీ విధానాల‌నే అధికార పార్టీ  అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాయి.

సామాన్యుల ప‌రిస్థిని ప‌క్క‌న పెడితే.. మేధావుల విష‌యానికి వ‌చ్చినా.. విభ‌జ‌న హామీల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదు. రాష్ట్రానికి ఇస్తామ‌న్న మెగా ప్రాజెక్టులు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అతీగతీ లేకుండా.. ఉన్నా యి.

కాబ‌ట్టి.. ఇలాంటి అంశాల‌ను విస్మ‌రించి.. బీజేపీ ఎద‌గ‌డం అనేది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  పోనీ.. సెంటిమెంటును రెచ్చ‌గొట్టి ఫ‌లితం ద‌క్కించుకుందామ‌ని అనుకున్నా.. ఇప్ప‌టికే విసిగిపోయిన ప్ర‌జ‌లు ఏమేర‌కు సెంటిమెంటుకు లొంగుతారు? అనేది ప్ర‌శ్నార్థకంగా మారింది. సో.. ఏతావాతా ఎలా చూసుకున్నా.. బీజేపీ అధికారంలోకి రావ‌డం.. అంత ఈజీ అయితే.. కాద‌ని అంటున్నారు పరిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.