Begin typing your search above and press return to search.

తెలంగాణ నిర్భయను పార్లమెంట్ లో చర్చించరా?

By:  Tupaki Desk   |   2 Dec 2019 6:12 AM GMT
తెలంగాణ నిర్భయను పార్లమెంట్ లో చర్చించరా?
X
దేశరాజధాని ఢిల్లీలో నిర్భయ ఉదంతం అప్పట్లో దేశాన్ని షేక్ చేసింది. ప్రజలను రోడ్ల మీదకు తీసుకొచ్చింది. నిరసనలతో హోరెత్తించేలా చేసింది. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నిర్భయను సింగపూర్ పంపించి వైద్యం చేయించింది. పార్లమెంట్ లో చర్చించింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షించింది.

ఇప్పుడు తెలంగాణలో మరో నిర్భయ ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ నలుగురు మృగాళ్ల ఆకృత్యానికి బలైపోయింది. నాడు ఢిల్లీలో నిర్భయ - నేడు తెలంగాణ నిర్భయకు జరిగింది సేమ్. పెద్దగా తేడా లేదు. కానీ దక్షిణాదిలోని హైదరాబాద్ లో జరిగిన ఈ వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అందరినీ విస్మయపరుస్తోంది. దేశమంతా తెలంగాణ నిర్భయ కు జరిగిన దారుణంపై గొంతెత్తుతున్నా.. సినీ - రాజకీయ - మీడియా ప్రముఖులు ఎలుగెత్తి చాటుతున్నా అసలు కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇక పార్లమెంట్ లో కనీసం దీని గురించి చర్చ పెట్టడానికి కూడా బీజేపీ మొగ్గుచూపకపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

దక్షిణాదిపై.. ఇక్కడి దారుణాలపై ఆదినుంచి బీజేపీకి చిన్నచూపే అనడంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దక్షిణాదికి బడ్జెట్ - అభివృద్ధి కార్యక్రమాల్లో ఆదినుంచే కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపిస్తూనే ఉందని దక్షిణాది పార్టీలు - నాయకులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాధిలో ఏదీ జరిగినా గుండెలు బాదుకొని బాంబాట్ చేసే బీజేపీ దక్షిణాదిలో మాత్రం ఏం జరిగినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఉత్తరాది వారికే విలువ - దక్షిణాది వారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ఇప్పుడు నిలదీస్తున్నారు..

ఓట్లు - సీట్లు - రాజకీయ లబ్ధి ఉంటేనే బీజేపీ పట్టించుకునే పరిస్థితి ఉందా అన్న చర్చ సాగుతోంది. బీజేపీకి ఉత్తరాదినే బలం - బలగం ఉంది. దక్షిణాదిలో తగినంత బలం లేదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం.అందుకే దక్షిణాది సమస్యలు - దారుణాలపై బీజేపీకి పట్టింపు లేదన్న విమర్శలు వస్తున్నాయి.