Begin typing your search above and press return to search.

బీజేపీకి శాపంగా మారిన 'బ‌ల్దియా కామెంట్స్‌'!!

By:  Tupaki Desk   |   27 Nov 2020 5:30 PM GMT
బీజేపీకి శాపంగా మారిన బ‌ల్దియా కామెంట్స్‌!!
X
రాజ‌కీయాల్లో నాయ‌కులు ఒక మాట అంటూ ఉంటారు. ``మ‌నం ఎన్ని చెప్పినా.. ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు! మ‌నం చెప్పే మాట‌ల‌ను వారు అన్ని కోణాల్లోనూ ప‌రిశీలిస్తారు``-అని. ఇది ఇప్పుడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో అక్ష‌ర స‌త్యంగా మారుతోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలూ హామీల వ‌ర‌ద‌ను పారిస్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకుంటాయి. ఈ క్ర‌మంలో ఏ పార్టీ ఎలాంటి కామెంట్లు చేసినా.. సోష‌ల్ మీడియాలో సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే అవి వైర‌ల్ అవుతున్నాయి. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా నాయ‌కులు చేసే కామెంట్లు వారికి, వారి పార్టీకి - పార్టీ అభ్య‌ర్థికి కూడా మేలు చేసేలా ఉండాలి.

కానీ, ఇప్పుడు బీజేపీ విష‌యాన్ని తీసుకుంటే.. త‌న కామెంట్ల‌తో త‌నే ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప ‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా గ్రేట‌ర్ ఫైట్‌ ను బీజేపీ ప్ర‌తిష్టాత్మంగా తీసుకుంది. ఇలా తీసుకోవ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే.. నాయ‌కులు చేస్తున్న కామెంట్ల‌నే చాలా మంది త‌ప్పుప‌డుతున్నారు. గ‌తంలో మాదిరిగా నాయ‌కులు కామెంట్లు చేస్తే.. ప్ర‌జ‌లు వాటికి ప‌డిపోయి.. ఓట్లు వేసే రోజులు ఇప్పుడు లేవు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని.. ప్ర‌జ‌లు వాటిపై చ‌ర్చించుకుంటున్నా రు. నిముషాల వ్య‌వధిలో స‌ద‌రు కామెంట్ల‌పై లోతుగా విశ్లేష‌ణ‌లు వ‌చ్చేస్తున్నాయి. దీంతో పార్టీలు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

బీజేపీ నేత‌లు ఇటీవ‌ల ఒక ఒక కామెంట్ చేశారు. రోహింగ్యాముస్లింల‌కు హైద‌రాబాద్ అడ్డాగా మారింద‌ని, తాము రోహింగ్యాల ముస్లింల‌ను త‌రిమి కొడ‌తామ‌ని చెప్పారు. మొత్తానికి ఈ కామెంట్ అంత‌రార్థం.. బీజేపీ ముస్లిం ఓట్ల‌ను రాబ‌ట్టేందుకైనా అయి ఉండాలి. లేదా.. ఎంఐఎం ఓటుబ్యాంకును చీల్చే ఉద్దేశం అయినా అయి ఉండాలి. అయితే.. ఈ కామెంట్ బీజేపీకి తిరుగు ట‌పాలో శ‌రాఘాతంగా మారింది. రోహింగ్యా ముస్లింలు హైద‌రాబాద్‌ కు రావ‌డం అంటే.. దేశ స‌రిహ‌ద్దులు దాటుకుని ఢిల్లీ వంటి రాజ‌ధానిని దాటుకుని.. హైద‌రాబాద్ రావాలి. మ‌రి ఇంత జ‌రుగుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏం చేస్తోంది. ఇదేనా ప్ర‌జ‌ల‌కు ఇచ్చే భ‌ద్ర‌త‌? ఇదేనా స‌రిహ‌ద్దుల్లో చూడాల్సిన ర‌క్ష‌ణ‌? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి బీజేపీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం లేదు.

మ‌రోవైపు.. వ‌ర‌ద బాధితుల‌కు కేసీఆర్ రూ.10 వేలు మాత్ర‌మే ఇచ్చార‌ని.. తాము గ్రేట‌ర్ ప‌గ్గాలు చేప‌డితే.. ఏకంగా రూ.25 వేల వ‌ర‌కు ఇస్తామ‌ని.. నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. దీనిపై కూడా బీజేపీ నేత‌ల‌ను ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీస్తున్నారు. ఓట్లు ఉంటేనే ప‌రిహారం ఇస్తారా? మీరు ఇవ్వ‌క‌పోతే.. పోనీ.. కేంద్రంలోని మీ నాయ‌కుల‌కు చెప్పి ఇప్పించొచ్చుక‌దా? ఓట్ల కోస‌మే ప‌రిహారం గుర్తుకు వ‌చ్చిందా? అని నిల‌దీస్తున్నారు. దీంతో ఈ రెండు కీల‌క అంశాలు కూడా బీజేపీకి బూమ‌రాంగ్ మాదిరిగా ఎదురు తిరిగాయి. మ‌రి మున్ముందు.. ఇంకెన్ని అగ‌చాట్లు ఎదుర‌వుతాయో చూడాలి.