Begin typing your search above and press return to search.

బీజేపీతో జనసేన దోస్తానా..అధికారం ఈ కూటమిదేనట!

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:50 PM GMT
బీజేపీతో జనసేన దోస్తానా..అధికారం ఈ కూటమిదేనట!
X
ఏపీలో సోమవారం నాటి కీలక భేటీ... ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు అటు బీజేపీలోనూ కొత్త ఆశలకు బీజం పడింది. బీజేపీతో కలిసి సాగుతామంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన - కాస్తంత స్లో మోషన్ లోనే నెరపిన మంత్రాంగం ఎట్టకేలకు ఫలించిందనే చెప్పాలి. పవన్ తనకు తానుగా చేసిన ప్రతిపాదనకు బీజేపీ కూడా జైకొట్టడంతో ఇప్పుడు బీజేపీ - జనసేన ఓ కూటమిగా ఏర్పడ్డాయి. సోమవారం విజయవాడ వేదికగా జరిగిన ఇరు పార్టీల నేతల కీలక భేటీలో... ఇకపై రెండు పార్టీలు కలిసే సాగే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో పవన్ లో కొత్త ఉత్సాహం తొణికిసలాడిన సంకేతాలు చాలా స్పష్టంగానే కనిపించాయి. భేటీ ముగిసిన తర్వాత బీజేపీ నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్... ఏపీలో 2024లో అధికారం చేపట్టేది తామేనంటూ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో తర్వాతి ప్రభుత్వం తమదేనంటూ పవన్ చాలా ధీమాగానే చెప్పేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏం మాట్టాడారన్న విషయానికి వస్తే... ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తాను బీజేపీతో కలిసేందుకు మొగ్గు చూపానని కూడా పవన్ అన్నారు. గతంలో బీజేపీతో కొన్ని అంశాల్లో అపార్థాలు ప్రచారంలోకి వచ్చాయని, వాటి ఫలితంగానే తాము బీజేపీకి దూరంగా ఉండిపోయామని చెప్పిన పవన్... వాటిపై కూలంకషంగా చర్చించుకున్నామని... ఇప్పుడు ఆ అపార్థాలన్ని సమసిపోయాయని... ఇకపై బీజేపీతో కలిసే ముందుకు సాగనున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బీజేపీ - జనసేన సిద్ధాంతాలు ఒకటేనని - అందుకే రెండు పార్టీల మధ్య కొత్త పొత్తు పొడిచిందని కూడా పవన్ పేర్కొన్నారు. ఇప్పటిదాకా టీడీపీ, వైసీపీ పాలనను చూసిన రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని - ఆ ప్రత్యామ్నాయం తమ కూటమేనని కూడా పవన్ చెప్పుకొచ్చారు. 2024లో ఏర్పడే ప్రభుత్వం తమ కూటమిదేనని కూడా పవన్ ధీమా వ్యక్తం చేశారు.

త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్న తాను... బీజేపీ అగ్ర నేతలతో రాష్ట్ర సమస్యలపై చర్చిస్తానని కూడా పవన్ పేర్కొన్నారు. తమతో పొత్తుకు సహకరించిన ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు పవన్ ప్రత్యేక కృతజ్ఝతలు చెప్పారు. ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమతో పొత్తు పెట్టుకునేందుకు పవన్ కల్యాణే స్వయంగా ముందుకు వచ్చారని, బీజేపీతో పొత్తుకు పవన్ షరతులేమీ పెట్టకుండానే ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి బేషజాలు లేకుండా పవన్ పొత్తుకు సిద్ధపడటం హర్షించదగ్గ విషయమని కూడా కన్నా చెప్పుకొచ్చారు. తమ రెండు పార్టీల మధ్య పొత్తు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు నిలువెత్తు నిదర్శనమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. మొత్తంగా బీజేపీతో కుదిరిన పొత్తుతో అధికారంపై పవన్ లో ధీమా పెరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.