Begin typing your search above and press return to search.

బీజేపీ ప్ర‌చారం!... పీకే మిన‌హా అంతా పాతొళ్లే!

By:  Tupaki Desk   |   9 March 2019 8:33 AM GMT
బీజేపీ ప్ర‌చారం!... పీకే మిన‌హా అంతా పాతొళ్లే!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ కోలాహ‌లం మొద‌లైపోయింది. గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి చాలా ముందుగానే ప్ర‌చారాన్ని మొద‌లెట్టిన బీజేపీ... ఈ ద‌ఫా మాత్రం చాలా నింపాదిగా క‌నిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పోల్ స్ట్రాట‌జీలో స‌త్తా క‌లిగిన వ్య‌క్తిగా పేరొందిన ప్ర‌శాంత్ కిశోర్ బృందానికి ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించిన క‌ల‌మ ద‌ళం... ప్ర‌చారాన్ని ఓ రేంజిలో నిర్వ‌హించింద‌నే చెప్పాలి. *అబ్ కీ బార్‌... మోదీ స‌ర్కార్*, *చాయ్ పే చ‌ర్చా*... త‌దిత‌ర నూత‌న కాన్సెప్ట్‌ల‌తో హోరెత్తించిన పీకే టీం... న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి బంప‌ర్ మెజారిటీ తెప్పించేశారు. ఇదంతా ఐదేళ్ల నాడు జ‌రిగిన తంతు. మ‌రి ఇప్ప‌టి ఎన్నిక‌ల్లో *అబ్ కీ బార్ మోదీ స‌ర్కార్‌*కు బ‌దులు క‌మ‌ల ద‌ళం నుంచి ఏ త‌ర‌హా నినాదం దూసుకువ‌స్తుంద‌న్న విష‌యంపై ఆస‌క్తి నెల‌కొంది.

ఈ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఇప్ప‌టికే ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన బీజేపీ... ఈ సారి కూడా త‌న ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను గ‌తంలో నిర్వ‌హించిన వారికే అప్ప‌గించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఓ కీల‌క మార్పు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకుని క‌నిపించిన ప్ర‌శాంత్ కిశోర్‌... ఈ ద‌ఫా ఆ బాధ్య‌త‌లు తీసుకోలేదు. పీకే మిన‌హా... త‌న‌ క్యాంపెయిన్ మొత్తం ఓల్డ్ టీంతోనే నిర్వ‌హించేలా బీజేపీ ప్లాన్ చేసుకుంది. ఈ వివ‌రాల్లోకెళితే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో *అబ్ కీ బార్‌... మోదీ స‌ర్కార్* అనే వైర‌ల్ నినాదాన్ని రూపొందించి ఒగిల్వి మేథ‌ర్ సంస్థ ఈ ద‌ఫా కూడా మోదీ మేనియాను త‌న‌దైన శైలిలో కాస్తంత కొత్త‌గా వినిపించ‌నుంది. ఈ సంస్థ అధినేత పీయూష్ పాండే ఇప్ప‌టికే రంగంలోకి దిగేసిన‌ట్లుగానూ స‌మాచారం. *అబ్ కీ బార్‌... మోదీ స‌ర్కార్* నినిదాన్ని నాడు రూపొందించింది పాండేనేన‌ట‌. జ‌నాల్లో క్ష‌ణాల్లో చొచ్చుకుపోవ‌డ‌మే కాకుండా... జ‌నాన్ని త‌న‌దైన శైలిలో బీజేపీ వైపున‌కు తిప్పేసిన ఈ నినాదాన్ని రూపొందించిన పాండే... ఈ సారి ఇంకెంత ప్ర‌భావ‌వంత‌మైన నినాదాన్ని వినిపిస్తారోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

ఒగిల్వితో పాటు గ‌డ‌చిన ఎన్నికల్లో ప్రచార మాధ్య‌మాల్లో బీజేపీ క్యాంపెయిన్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన *మాడిసన్ మీడియా*నే ఈ ద‌ఫా కూడా ఆ బాధ్య‌త‌ల‌ను తీసుకుంది. ప్రింట్‌ - డిజిట‌ల్ - టీవీ - రేడియో త‌దిత‌ర అన్ని ఫ్లాట్‌ ఫాంల మీడియాలో బీజేపీ ప్ర‌చారాన్ని నిర్వ‌హించేందుకు ఈ సంస్థ య‌జ‌మాని సామ్ బల్సారా రంగంలోకి దిగిపోయార‌ట‌. ఈ ద‌ఫా ఈ సంస్థ చేప‌ట్టే ప‌నికి బీజేపీ ఏకంగా రూ.500 కోట్ల మేర భారీ మొత్తాన్ని అందించ‌నుంద‌ట‌. ఒక్క మాడిస‌న్‌ కే రూ.500 కోట్లు ఇస్తుంటే... ఇక *అబ్ కీ బార్‌... మోదీ స‌ర్కార్* లాంటి జ‌నాన్ని ఇట్టే ఆక‌ట్టుకునే నినాదాల‌ను రూపొందించ‌నున్న పీయూష్ పాండే ఆధ్వ‌ర్యంలోని ఒగిల్వి కి ఇంకెంత ముట్ట‌జెప్ప‌నున్నార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిపోయింది. మొత్తంగా ఈ ద‌ఫా ప్రశాంత్ కిశోర్ లేక‌పోయినా కూడా బీజేపీ క్యాంపెయిన్ బ‌డ్జెట్ అమాంతంగా పెరిగిపోయింద‌నే చెప్పాలి.