Begin typing your search above and press return to search.

మండ‌లి ర‌ద్దుకు బీజేపీ సానుకూలంగానే..దానికీ లెక్క‌లున్నాయి!

By:  Tupaki Desk   |   4 Feb 2020 5:30 PM GMT
మండ‌లి ర‌ద్దుకు బీజేపీ సానుకూలంగానే..దానికీ లెక్క‌లున్నాయి!
X
ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దు విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ సానుకూలంగానే ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. మండ‌లి ర‌ద్దు విష‌యం ప్ర‌స్తుత బ‌డ్జెట్ స‌మావేశాల్లో పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌కు వ‌స్తుందా, రాదా.. అనేది చ‌ర్చ‌నీయాంశంగానే ఉంది ఇంకా. రాద‌ని తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్ర‌చారం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా స‌మావేశాలు సుదీర్ఘంగా ఉండ‌బోతున్న నేప‌థ్యంలో.. మండ‌లి ర‌ద్దు తీర్మానం చ‌ర్చ‌కు వ‌స్తుందా.. అనేది చ‌ర్చ‌నీయాంశంగానే ఉంది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. భార‌తీయ జ‌న‌తా పార్టీ అంత‌ర్గ‌త లెక్క‌లు ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దుకు అనుకూలంగా ఉన్నాయ‌ట‌. వాస్త‌వానికి ఏపీ శాస‌న‌మండ‌లిలో బీజేపీకి ఉన్న స‌భ్యులు ఇద్ద‌రే. ఆ సంఖ్య రానున్న రోజుల్లో త‌గ్గిపోయేదే. ఏపీలో ఎమ్మెల్సీల‌ను గెలిపించుకునే స్థితిలో బీజేపీ లేదు. ఈ నేప‌థ్యంలో మండ‌లి ఉన్నా లేక‌పోయినా ఆ పార్టీకి పెద్ద‌గా ఉప‌యోగం లేదు. అయితే ఉన్న ఫ‌లంగా ర‌ద్దు అయితే ఇద్ద‌రు ఎమ్మెల్సీలూ రాజ‌కీయ నిరుద్యోగులు అవుతారు.

అయితే మండ‌లి ర‌ద్దు అయితే అది తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి దెబ్బ‌, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా త‌న అవ‌కాశాల‌ను ముందు ముందు కోల్పోతుంది. ఈ నేప‌థ్యంలో మండ‌లిర‌ద్దు తెలుగుదేశం పార్టీకి ప్ర‌స్తుతానికి గ‌ట్టి ఝ‌ల‌క్ అవుతుంది, వైసీపీకి ముందు ముందు ఎమ్మెల్సీ అవ‌కాశాలు ఉండ‌వు. ఈ రెండూ త‌న‌కు అనుకూలంగా లెక్కేస్తోంద‌ట బీజేపీ. ప్ర‌త్యేకించి ఇప్పుడు మండ‌లి ర‌ద్దు అయితే తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఉన్న దాదాపు 30 మంది రాజ‌కీయ నిరుద్యోగులు అవుతారు. వారిలో చాలా మంది ఎమ్మెల్సీ ప‌ద‌వి పోతే తెలుగుదేశం పార్టీలో ఉండ‌టానికి అంత సానుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. వారు వైసీపీలోకి చేరే అవ‌కాశాలు ఏ మాత్రం ఉండ‌వు. ఈ నేప‌థ్యంలో మండ‌లి ర‌ద్దు అయితే.. తెలుగుదేశం పార్టీ నేత‌లు బీజేపీలోకి క్యూ క‌ట్టే అవ‌కాశాలున్నాయి. ఈ లెక్క‌ల‌నే వేస్తోంద‌ట బీజేపీ.

ఏపీలో వ‌చ్చి చేరే నేత‌ల‌కు వెల్క‌మ్ చెబుతూ ఉంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఇలాంటి నేప‌థ్యంలో మండ‌లి ర‌ద్దుకు పార్ల‌మెంట్ ఆమోదముద్ర వేస్తే టీడీపీ నుంచి బీజేపీలోకి రాజ‌కీయ వ‌ల‌స‌లు గ‌ట్టిగానే ఉంటాయ‌ని క‌మ‌లం పార్టీ వారు అనుకుంటున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో శాస‌న‌మండ‌లి ర‌ద్దులో త‌న అనుకూల‌త‌ను చూస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీ దాని ర‌ద్దుకు ఢిల్లీలో ఆమోద‌ముద్ర వేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.