Begin typing your search above and press return to search.

రాజ్యసభ ఎన్నికల్లోను క్యాంపు రాజకీయాలేనా ?

By:  Tupaki Desk   |   3 Jun 2022 4:27 AM GMT
రాజ్యసభ ఎన్నికల్లోను క్యాంపు రాజకీయాలేనా ?
X
చివరకు రాజ్యసభ ఎన్నికల్లో కూడా క్యాంపు రాజకీయాలు తప్పటం లేదు. ప్రధానంగా తమ ఎంఎల్ఏలను రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు నడుపుతోంది.

రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని ఎంఎల్ఏలను కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీ క్యాంపులు నడుపుతోంది. రాజస్ధాన్ లో 4, హర్యానాలో 2, మహారాష్ట్రలో 6, కర్నాటక 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 10వ తేదీన ఎన్నిక జరగబోతోంది. మామూలుగా అయితే తమకున్న బలం ప్రకారమే వివిధ పార్టీలు నామినేషన్లు వేసుకుంటాయి.

బలం లేని పార్టీలు ముందు నామినేషన్లు వేసినా చివరి నిముషంలో ఉపసంహరించుకుంటాయి కాబట్టి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమవుతాయి. అయితే పై రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేకపోయినా కాంగ్రెస్ ఎంఎల్ఏలను చీల్చాలని ప్లాన్ చేసింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా మిగిలిన కాంగ్రెస్ ఎంఎల్ఏల ఓట్లతో పాటు స్వతంత్ర ఎంఎల్ఏల కోసం గాలమేస్తోంది. ఇందుకోసం డైరెక్టుగా తమ పార్టీ తరపున ఎవరినీ రంగంలోకి దింపకుండా ఇతరులను పోటీలోకి దింపింది.

బీజేపీ చేసిన పని వల్ల పై రాష్ట్రాల్లో ఏకగ్రీవానికి బదులుగా ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కాంగ్రెస్ అప్రమత్తమై రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎంఎల్ఏలను క్యాంపులకు తరలించింది. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అందుకనే రాజస్థాన్లో మీడియా ప్రముఖుడు సుభాష్ చంద్ర, హరియానాలో రాజకీయ ప్రముఖుడు వినోద్ శర్మ కొడుకు కార్తికేయ శర్మ పోటీలోకి దిగారు. సుభాష్ కు బీజేపీ డైరెక్టుగా మద్దతు పలికింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను గెలవకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ తరపున మాత్రం పోటీలో ఉన్న అభ్యర్థులందరూ గెలవకూడదన్నదే బీజేపీ ప్లాన్. గెలుస్తామని అనుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్ధుల్లో ఒకరిని ఓడించగలిగినా తమ టార్గెట్ రీచయినట్లే అని బీజేపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు.

రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో చీలికలు తేవటం, అవకాశముంటే ప్రభుత్వాలను కూల్చేయటమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. మరి తన ప్రయత్నాల్లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.