Begin typing your search above and press return to search.

‘గాలి’ బెడద వదిలించుకున్న మోడీదళం

By:  Tupaki Desk   |   5 Jan 2018 12:45 PM GMT
‘గాలి’ బెడద వదిలించుకున్న మోడీదళం
X
షేర్లలో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలో తెలియడం కాదు.. షేర్లను ఎప్పుడు వదిలించుకోవాలో తెలిసిన వాడే గొప్ప వ్యాపార వేత్త అవుతాడని ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన వారెన్ బఫెట్ సూక్తిగా ప్రచారంలో ఉంది. దీనినే కాస్త స్టయిలు మార్చి.. ‘‘ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలియాలి..’’ అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ గురించి డైలాగుగా వాడుకున్నారు. ఈ సిద్ధాంతాల తరహాలోనే ఎవరిని ఎప్పుడు జట్టులో కలుపుకోవాలో తెలియడం మాత్రమే కాదు.. ఎవరిని ఎప్పుడు వదిలించుకోవాలో తెలియడమే ఆధునిక రాజనీతి అని ప్రధాని నరేంద్రమోడీ దళం, భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నిరూపిస్తున్నట్లుగా ఉంది. ఒకప్పుడు ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన బళ్లారి గనుల దిగ్గజం , మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డికి భాజపాకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడు భాజపా అంటోంది. గాలి జనార్దన రెడ్డి భాజపా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కూడా హైకమాండ్ అనుమతి కావాల్సిందే అంటోంది. చూడబోతే.. కేసుల్లో చిక్కుకుని, సంపదను కూడా పోగొట్టుకున్న గాలి జనార్దనరెడ్డిని వదిలించుకోవడమే.. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాలిస ఉన్న కర్నాటకలో తమకు లాభిస్తుందని భాజపా వ్యూహాత్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ ఏడాదిలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని భాజపా నానా ప్రయత్నాలు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కర్నాటక పరివర్తన ర్యాలీని నిర్వహిస్తున్నారు. ర్యాలీలో భాగంగా ఆయన బళ్లారికి చేరుకున్నప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. మీడియా ప్రశ్నలకు యడ్యూరప్ప సమాధానం ఇస్తూ.. గాలి జనార్దనరెడ్డికి భాజపాతో ప్రస్తుతం సంబంధంలేదని, ఆయన పార్టీలో కూడా లేరని చెప్పారు. నిజానికి కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత.. బళ్లారి నగరంలో ఉండరాదని కూడా ఆదేశించడంతో గాలి జనార్దనరెడ్డి నివాసం కూడా బెంగుళూరునగరంలోనే ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవహారాలకు కూడా దూరంగానే ఉంటున్నారు.

దానికి తగినట్లుగానే యడ్యూరప్ప కూడా గాలితో తమకు సంబంధమే లేదన్నట్లు సెలవివ్వడం గమనార్హం. ఒకప్పుడు గాలి జనార్దనరెడ్డి భాజపాలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పారు. అందుకే పెద్దలు అన్నారు ... ‘‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’’ అని! మోడీ సారథ్యంలోని కమలదళం.. గాలి విషయంలో ఇదే సిద్ధాంతం అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.