Begin typing your search above and press return to search.

దక్కిన దానికంటె..నిలుపుకున్నదే కిక్ ఎక్కువట!!

By:  Tupaki Desk   |   18 Dec 2017 5:24 AM GMT
దక్కిన దానికంటె..నిలుపుకున్నదే కిక్ ఎక్కువట!!
X
మనవద్ద ఉన్న సంపద మనవద్దే ఉంటే పెద్దగా కిక్ ఏముంటుంది? ఎదుటివారి చేతిలో ఉన్నది కూడా మనకి దక్కినప్పుడే ఎక్కువ కిక్ ఉంటుంది.

మామూలుగా అయితే ఈ సిద్ధాంతం నిజమే కావొచ్చు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం.. ఈ సిద్ధాంతానికి రివర్సుగేర్ లో మాట్లాడుతున్నారు. కొత్తగా దక్కిన దానికంటె.. మనవద్ద ఉన్న దానిని నిలబెట్టుకోవడంలో ఇంకా ఎక్కువ కిక్ దక్కుతున్నదని వారు అంటున్నారు. అవును మరి.. కాంగ్రెస్ చేతిలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధికారాన్ని ఇప్పుడు భాజపా దక్కించుకోవడానికంటె మించి, గుజరాత్ లో తమ చేతిలో గత 22 ఏళ్లుగా ఉన్న అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోగలగడమే అతి గొప్ప విజయంగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారంటే.. అందులో మతలబు అదే మరి!

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఓటర్ల తీర్పు విషయంలో భిన్నాభిప్రాయాలు ఎవ్వరికీ లేవు. ఈ రాష్ట్రంలో అధికారాన్ని గత కొంతకాలంగా కాంగ్రెస్ – భాజపాలు మార్చి మార్చి పంచుకుంటూ వస్తున్నాయి. అదే క్రమంలో ఈసారి కూడా ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ఉన్నది గనుక.. భాజపా గెలుస్తుందని తొలినుంచి అనుకుంటూ ఉన్నారు. మరైతే.. గుజరాత్ విషయంలోనే ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. ప్రధాని నరేంద్రమోడీకి ఇది సొంత రాష్ట్రం కావడం.. జీఎస్టీ సహా ప్రధాని తీసుకున్న ఇటీవలి అనేక నిర్ణయాల పట్ల ఆయన సొంత రాష్ట్రంలో కూడా తీవ్రస్థాయిలో ప్రతిఘటనలు ఎదురుకావడం.. ఇలాంటి నేపథ్యంలో.. ఫలితాలు తిరగబడవచ్చునేమో అని అంతా అనుకున్నారు. పైగా ఈ రాష్ట్రంలో గత అయిదు ఎన్నికల్లో భాజపా వరుసగా విజయాలు నమోదు చేస్తూనే వస్తోంది. ఇంత సుదీర్ఘ కాలం ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. సహజంగా ప్రజల్లో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత భాజపాను దెబ్బతీయగలదని విపక్షం వారు భావించారు. కాంగ్రెస్ అదే ఆశతో.. గుజరాత్ పై చాలా ఆశలు పెట్టుకుంది. చాలా ఎక్కువ ఫోకస్ పెట్టింది.

రాహుల్ ఇక్కడి ఎన్నికలను తన నాయకత్వానికి, తన ఎన్నికల వ్యూహచాతుర్యానికి ఒక సవాలుగా తీసుకున్నారు. అక్కడ కులనేతలను సమీకరించారు. వారికి రకరకాల తాయిలాలు ప్రకటించారు. కులాల పోరాటాల్లో లీడ్ చేస్తున్న కీలక వ్యక్తులను తన పార్టీకి మద్దతుగా మలచుకోవడం ద్వారా.. సునాయాసంగా విజయం దరిజేరగలమని ఆయన భావించారు. అంత కీలకంగా రాహుల్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఇటు వైపునుంచి మోడీ దళం కూడా చెమటోడ్చవలసి వచ్చింది. ప్రధాని ఏకంగా 80కి పైగా సభలు - ర్యాలీలు - ప్రదర్శనల్లో పాల్గొని.. అక్కడ ప్రచారం నిర్వహించారు. అంత కష్టపడిన నేపథ్యంలో.. ఉన్న అధికారాన్ని తిరిగి నిలబెట్టుకున్న గుజరాత్ విజయమే.. తమకు మహద్భాగ్యంగా కనిపిస్తున్నదని - హిమాచల్ ప్రదేశ్ కంటె - గుజరాత్ విజయమే ఎక్కవ కిక్ ఇస్తున్నదని కమలనాధులు వ్యాఖ్యానిస్తున్నారు.