Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ను బీజేపీ ప‌క్క‌నెట్టేసిందా?

By:  Tupaki Desk   |   24 April 2022 12:30 AM GMT
ప‌వ‌న్‌ను బీజేపీ ప‌క్క‌నెట్టేసిందా?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో బంధాన్ని తెంచుకునేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోందా? అందుకే ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటుందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌వ‌న్ వైఖ‌రితో విసుగు చెందిన క‌మ‌ల ద‌ళం జ‌న‌సేన‌ను దూరం పెట్టాల‌ని చూస్తున్న‌ట్లు వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ తీరు చూస్తుంటే అది నిజ‌మేన‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఆయ‌న త‌మ్ముడు..

వైసీపీ మంత్రిగా ఉండే మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21న హ‌ఠాత్తుగా గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. దీంతో నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ స్థానం ఖాళీ అయింది. ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన‌ట్లు ఏపీ అసెంబ్లీ కూడా నోటిఫై చేసిన సంగ‌తి తెలిసిందే. నిబంధ‌న‌ల ప్రకారం నోటిఫై చేసిన ఆరు నెల‌ల్లోపు ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించాలి.

అందుకోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఈ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఆత్మ‌కూరు అభ్య‌ర్థిగా దివంగ‌త గౌత‌మ్‌రెడ్డి త‌మ్ముడు విక్ర‌మ్‌రెడ్డి పేరును కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు పంపారు. దీంతో ఈ ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌ర‌పున విక్ర‌మ్‌రెడ్డి బ‌రిలో దిగ‌డం ఖాయ‌మైంది.

బీజేపీ సై..

ఇక మ‌రోవైపు బీజేపీ ఈ ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌వుతోంది. చ‌నిపోయిన ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల‌ని మిగ‌తా పార్టీలు అనుకుంటుంటే బీజేపీ మాత్రం పోటీకి సై అంటోంది. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లోనూ అదే పంథా అనుస‌రించి పోటీలో దిగింది. ఇప్పుడు ఆత్మ‌కూరులోనూ త‌ల‌ప‌డేందుకు సై అంటోంది.

అయితే మేక‌పాటి కుటుంబం నుంచే బీజేపీ అభ్య‌ర్థి బ‌రిలో దిగుతార‌నే ప్ర‌చారం జోరంద‌కుంది. నెల్లూరులో జ‌రిగిన బీజేపీ ప‌దాధికారుల స‌మావేశంలో సోము వీర్రాజు.. ఆత్మ‌కూరులో బీజేపీ పోటీ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్రక‌టించారు.

టీడీపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌ని..

అయితే పొత్తులో ఉన్న జ‌న‌సేన‌తో చ‌ర్చించ‌కుండా సోము వీర్రాజు ఏక‌ప‌క్షంగా ఆత్మకూరు అభ్య‌ర్థి విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య దూరం పెరిగింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి సాగేందుకు జ‌న‌సేన మొగ్గు చూపుతుంద‌నే విష‌యంపై బీజేపీ ఆగ్ర‌హంగా ఉంద‌ని స‌మాచారం. అందుకే జ‌న‌సేన‌తో సంబంధం లేకుండా ఇప్పుడు ఆత్మ‌కూరులో అభ్య‌ర్థిని నిల‌బెడ‌తామ‌ని ప్ర‌క‌టించింది.

గ‌త కొంత‌కాలంగా ప‌వ‌న్ కూడా బీజేపీతో అంటీముట్ట‌నట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన పోటీ చేయ‌దు అని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. బీజేపీ త‌మ అభ్య‌ర్థిని నిల‌బెట్టింది. ఇక ఇటీవ‌ల రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటామ‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ప‌ని చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు టీడీపీని దూరం పెడుతున్న బీజేపీకి ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌డం లేద‌ని టాక్‌. అందుకే దూరం పెట్టేందుకు సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. కానీ బీజేపీ ఒంట‌రి ప్ర‌యాణం సాగిస్తే ఆ పార్టీకి న‌ష్ట‌మే త‌ప్ప లాభం ఏమీ ఉండ‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.