Begin typing your search above and press return to search.

దక్షిణాది ఆదుకుంటుందా ?

By:  Tupaki Desk   |   7 July 2022 4:22 AM GMT
దక్షిణాది ఆదుకుంటుందా ?
X
వచ్చే ఎన్నికల్లో లోక్ సభ సీట్ల కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నరేంద్రమోడి సర్కార్ పై దేశవ్యాప్తంగా బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే ఉత్తరాధి ఎన్నికల్లో బాగా దెబ్బపడుతుందని బీజేపీ అగ్రనేతలు అనుమానిస్తున్నారు. అందుకనే వాళ్ళ కన్ను దక్షిణాది రాష్ట్రాల మీద పడింది. ఉత్తరాధిలో దెబ్బ పడుతుందని అనుకుంటున్న సీట్లను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్నది కమలనాదుల వ్యూహం.

అనుమానాలు సరే, వ్యూహాలు బాగానే ఉన్నాయి కానీ అగ్రనేతల కలలు సాకారమవుతాయా ? అనుమానంగానే ఉంది క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు. అయితే ఈ విషయం మోడీకి కూడా బాగా తెలుసు. ఇందుకనే దక్షిణాది జనాలను ఆకర్షించటంలో భాగంగానే తాజాగా నలుగురు ప్రముఖులను రాజ్యసభకు ఎంపిక చేశారు.

వివిధ రంగాల్లోని ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభ ఎంపీలుగా నామినేట్ చేశారు. క్రీడలరంగం నుండి పీటీ ఉష, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, సినీకథా రచయిత విజయేంద్రప్రసాద్, కర్నాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే నామినేట్ అయ్యారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే పై నలుగురు వివిధ రంగాల్లో ప్రముఖలనే చెప్పాలి. అయితే ఇళయరాజా, విజయేంద్రప్రసాద్ వాళ్ళ రంగాలకు చేస్తున్న సేవలేమీ లేవు. వీళ్ళు పక్కా కమర్షియల్ వ్యక్తులు. పీటీ ఉష మాత్రం కేరళలో అకాడమి ఏర్పాటుచేసి దేశం తరపున పాల్గొనేందుకు (రన్నింగ్) స్ప్రింటర్లను తయారుచేస్తున్నారు.

ఈమె శిక్షణలోనే ఆసియా, ఒలంపిక్స్ క్రీడల్లో కొందరు పాల్గొన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఉష ఎంపిక మాత్రమే అర్ధవంతమైనది. కొంతకాలంగా మోడీని ఇళయరాజా వేదికల మీద ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దాంతోనే రాజాకు రాజ్యసభ ఖాయమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇక వీరేంద్ర హెగ్డే ఆధ్యాత్మిక రంగానికి చెందిన వ్యక్తి. ప్రముఖులను రాజ్యసభకు పంపటం వరకు బాగానే ఉంది కానీ వీళ్ళల్లో ఎంతమంది పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారన్నది అనుమానమే. ఎందుకంటే గతంలో కూడా సచిన్ తెండూల్కర్, రేఖ లాంటి ప్రముఖులను రాజ్యసభకు పంపినా వాళ్ళు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారా లేదా అన్నది కూడా ఎవరికీ తెలీదు. సరే ఇపుడు వీళ్ళ ఎంపిక ద్వారా బీజేపీకి దక్షిణాదిలో వచ్చే మైలేజీ ఏమిటో అర్ధం కావటంలేదు. ఎందుకంటే వీళ్ళవల్ల బీజేపీకి పట్టుమని వంద ఓట్లు వచ్చేది కూడా అనుమానమే.