Begin typing your search above and press return to search.

బీజీపీ కోటా.... జనసేన వాటాలోకే...?

By:  Tupaki Desk   |   11 May 2022 9:31 AM GMT
బీజీపీ కోటా.... జనసేన  వాటాలోకే...?
X
కొన్ని సార్లు కొందరి నిర్ణయాలు మరి కొందరికి మేలు జరిగేలా ఉంటాయి. రాజకీయాల్లో చూసుకుంటే ప్రతి చర్యకూ ప్రతి చర్య ఉంటుంది అంటారు. ఇక ఏపీలో పొత్తుల పితలాటం ఒక్క లెక్కన సాగుతోంది. 2014 పొత్తులను రిపీట్ చేయడానికి ఒకే ఒక పార్టీ అడ్డుగా ఉంది. ఆ పార్టీయే బీజేపీ. దాంతో పొత్తుల కధ మరి కొంతకాలం పాటు ఇలాగే క్లారిటీ లేకుండా సాగే వీలుంది అంటున్నారు.

అయితే దీనికి ఎండ్ పెట్టే పార్టీ ఒక్కటే అంటున్నారు. ఆ పార్టీయే జనసేన. జనసేన బీజేపీతో 2020 జనవరి 16న పొత్తు పెట్టుకుంది. అయితే నాటి నుంచి రెండు పార్టీలు కలసి నడచిన సందర్భాలు పెద్దగా లేవు అనే చెప్పాలి. ఇక జనసేన గత ఏడాది జరిగిన నాయకులు కొన్ని జిల్లాల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీతో నేరుగా పొత్తు పెట్టుకున్నారు. అలా కొన్ని ఆశాజనకమైన ఫలితాలను చవిచూశారు.

నాటి నుంచి పొత్తుల కోసం రెండు పార్టీల మధ్య మాటలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక ఈ ఏడాది మధ్యకు వచ్చేసరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీలు పొత్తు కచ్చితంగా పెట్టుకుంటాయని అంటున్నారు. దానికి తగిన వాతావరణం కూడా కనిపిస్తోంది.

అయితే ఈ పొత్తులు ఎత్తులు వాటి వెనక మాటలను గమనిస్తూ వస్తున్న బీజేపీ మాత్రం మేము ససేమిరా టీడీపీతో కలవమని అంటోంది. తమ మితృత్వం అంతా కేవలం జనసేనతోనే అని కూడా సోము వీర్రాజు చెబుతున్నారు. ఆయన మరో అడుగు ముందుకేసి తమకు మరే పార్టీతో పొత్తు అక్కరలేదని జనంతోనే పొత్తులు అని కూడా చెప్పేస్తున్నారు. అంటే బీజేపీకి టీడీపీతో పొత్తు కలపడం అసలు ఇష్టం లేదు అనే అంటున్నారు.

మరి బీజేపీ ఈ విధంగా బెట్టు చేస్తూ పోతే రేపటి రోజున ఆ పార్టీకే నష్టం అని అంటున్నారు. నిజానికి మూడు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే జనసేనకు నలభై దాకా సీట్లు, బీజేపీకి పది సీట్లు ఇవ్వాలని టీడీపీఎ ఫిక్స్ అయిందని టాక్. ఇపుడు ఎటూ బీజేపీ పొత్తుకు రాను అంటున్న నేపధ్యం ఉంది కాబట్టి జనసేనకు 40 సీట్లు ఇచ్చి మిగిలిన వాటిలో తాను పోటీ చేయలని టీడీపీ చూస్తోంది అని చెబుతున్నారు.

అయితే ఈ విషయంలో జనసేన కూడా పట్టు మీద ఉంది అంటున్నారు. బీజేపీ పొత్తు నుంచి తప్పుకుంటే ఆ పార్టీకి ఇచ్చే పది సీట్లను కూడా జనసేన కోరే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అంటే జనసేన యాభై సీట్లకు పోటీ చేస్తుంది అన్న మాట. ఇప్పటికే 45 సీట్ల దాకా జనసేన పోటీ చేసే వాటిని గుర్తించారుట. మరో అయిదారు సీట్ల నుంచి కూడా డిమాండ్ వస్తూండడంతో టోటల్ గా యాభైకి ఫిక్స్ అయిపోవాలని జనసేన ఆలోచిస్తోంది అంటున్నారు. మరి దీని మీద టీడీపీ ఏమంటుందో చూడాలి. ఏది ఏమైనా జనసేంతో టీడీపీకి అవసరాలు చాలా ఉంటాయి కాబట్టి కచ్చితంగా యాభై సీట్లు ఇస్తారనే అంటున్నారు.

ఇక పొత్తుల కధ అయితే ఇప్పటికే సీట్ల ఎంపిక దాకా వచ్చేసిన క్రమంలో బీజేపీ ఆ గట్టున ఉంటూ బెట్టు చేయడం వల్ల తానే నష్టపోతోంది అంటున్నారు. అలాగే బీజేపీకి బలమున్న కొన్ని సీట్లు కూడా జనసేనకు వెళ్తాయని చెబుతున్నారు. సో బీజేపీ నో అంటే అది జనసేన నెత్తిన పాలు పోసినట్లేనా అన్న చర్చ ఉంది. చూడాలి ఇంకా ఎన్నికలకు చాలా దూరం ఉన్నందున ఈ పొత్తుల కధ ఇక్కడితో ఫుల్ స్టాప్ పడదు అనే అంటున్నారు.