Begin typing your search above and press return to search.

తెలంగాణలో అభ్యర్థుల కోసం బీజేపీ మరోసారి సర్వే..

By:  Tupaki Desk   |   10 Jan 2023 6:51 AM GMT
తెలంగాణలో  అభ్యర్థుల కోసం బీజేపీ మరోసారి సర్వే..
X
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ శత విధాలా ప్రయత్నిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకత్వం సైతం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు నేరుగా ఢిల్లీ పెద్దలు వ్యూహం పన్నుతున్నారు. అయితే ఇప్పటికే ప్రజల నాడి తెలుసుకున్న బీజేపీ నాయకులు మరోసారి ప్రత్యేక సర్వే చేయించనున్నారట. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు..? ఇప్పుడున్న పార్టీలపై వారి అభిప్రాయమేంటి..? అనే విషయాలు తెలుసుకోనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లో ఎంత మంది అసంతృప్తితో ఉన్నారు..? వారికి ఎలాంటి హామీలు ఇవ్వాలన్న విషయంపై సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తూ.. అభివృద్ధి పనులపై ఫోకస్ పెడుతోంది. గ్రామాల నుంచి నగరాల వరకు అభివృద్ధి పనులు సీరియస్ గా జరగాలని కిందిస్తాయి నాయకులకు కేసీఆర్ నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు పార్టీలోని కేడర్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు వారికి వచ్చే ఎన్నికల్లో ఇచ్చే పదవులపై హామీ ఇస్తున్నారు. ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించే సభలో కేసీఆర్ ప్రసంగం ఎన్నికలను తలపించే విధంగా ఉంటోందని అనుకుంటున్నారు.

మరోవైపు బీజేపీ అంతేస్థాయిలో ఎన్నికలను సీరియస్ గా తీసుకోనుంది. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నుంచి ఇప్పటికే చాలా మంది బీజేపీలో చేరారు. తాజాగా సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.

ఓ వైపు ఖమ్మంలో 18న బీఆర్ఎస్ సభ జరుగుతుండగా.. మరోవైపు ఆయన ఇదే రోజు అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత పార్టీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. పొంగులేటితో పాటు మరికొంత మంది నాయకులు కూడా బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే బీజేపీలోకి వచ్చే నాయకుల వివరాలు ముందుగానే తెలుసుకోనున్నారు. టికెట్ ఆశించి వచ్చే నాయకులకు కమిట్ అయితే లాభిస్తుందా..? నష్టం చేకూరుతుందా..? అనేది సర్వే చేయించనున్నారు. పార్టీ కోసం ఇంతకాలం పనిచేసిన కొందరు తమను కాదని వేరొకరికి టికెట్ ఇస్తే తమ పరిస్థితేంటి..? అన్న సమస్య ఎదురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో వారిని ఎలా బుజ్జగించాలి..? అనేది తేల్చనున్నారు.

మరోవైపు ప్రజా నాడి తెలుసుకునేందుకు బీజేపీ మరోసారి సర్వే చేయిస్తోందట. కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నా..మరికొన్ని చోట్ల మాత్రం పటిష్టంగా మారాల్సి ఉంది. అయితే అలాంటి చోట్ల ఎలాంటి హామీలు ఇస్తే ప్రజలు బీజేపీని ఆదరిస్తారు..? అనే విషయాలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే సంవత్సరం పాటు ఉచిత బియ్యాన్ని కేంద్రం ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రచారం చేయనున్నారు. దీంతో కొంతవరకైనా ఈ ప్రచారం మేలు చేస్తుందని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.