Begin typing your search above and press return to search.

65 ఏళ్ల కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేసిన మోడీ

By:  Tupaki Desk   |   4 Aug 2017 8:13 AM GMT
65 ఏళ్ల కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేసిన మోడీ
X
ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 65 ఏళ్లుగా నాన్ స్టాప్ గా ఉన్న రికార్డును బ్రేక్ చేయ‌టం అంత మామూలు విష‌యం కాదు. అది కూడా కాంగ్రెస్ పార్టీకి త‌ప్పించి మ‌రే పార్టీకి ఇప్ప‌టివ‌ర‌కూ సాధ్యం కాని దాన్ని సాధ్య‌మ‌య్యేలా చేయ‌టంలో మోడీ రోల్ కీల‌క‌మ‌ని చెప్పాలి. ఇంత‌కూ కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేసిన మోడీ అండ్ కో సాధించిన రికార్డు ఏమిటంటే.. రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ బ‌లం కంటే బీజేపీ బ‌లం పెర‌గ‌టం.

స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత నేటి వ‌ర‌కూ పెద్ద‌ల స‌భ (రాజ్య‌స‌భ‌)లో కాంగ్రెస్ పార్టీదే అధిక్య‌త‌. ఏ ద‌శ‌లోనూ ఆ రికార్డును ఏ రాజ‌కీయ పార్టీ బీట్ చేయ‌లేక‌పోయింది. తాజాగా జ‌రిగిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన బీజేపీ నేత సంప‌తీయ ఉయికే ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టంతో రాజ్య‌స‌భ‌లో బ‌లాబ‌లాలు మారిపోవ‌టంతో పాటు.. అరుదైన రికార్డు బీజేపీ సొంత‌మైంది.

తాజాగా రాజ్య‌స‌భ‌లో బీజేపీకి 58 మంది స‌భ్యులు ఉండ‌గా.. కాంగ్రెస్ పార్టీకి 57 మంది మాత్ర‌మే ఉన్నారు. వాస్త‌వానికి 2018 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి రాజ్య‌స‌భ‌లో బ‌లం ఉండాల్సి ఉండ‌గా.. ఇటీవ‌ల ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రు నేత‌లు (తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డి.. సిక్కిం రాష్ట్రానికి చెందిన‌ హ‌జీ అబ్దుల్ స‌లామ్) మ‌ర‌ణించ‌టంతో బలం త‌గ్గింది.

వ‌చ్చే వారంలో ప‌శ్చిమ‌బెంగాల్ లో ఆరు.. గుజ‌రాత్ లో మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిల్లో గుజ‌రాత్‌కు చెందిన రెండు స్థానాల్లో బీజేపీ సునాయాసంగా గెలవటం ఖాయం. మ‌రో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అహ్మ‌ద్ ప‌టేల్‌కు గట్టి పోటీని ఇస్తోంది. అయితే.. అహ్మ‌ద్ ప‌టేల్ గెలుపున‌కు చెక్ పెట్టేందుకు వీలుగా బీజేపీ పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామం కాంగ్రెస్‌కు ఇప్పుడు వ‌ణికిస్తోంది. పార్టీ అధినేత్రికి రాజ‌కీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించే అహ్మ‌ద్ ప‌టేల్‌ను ఓడించ‌టం ద్వారా సోనియాకు షాకివ్వాల‌ని అమిత్ షా అండ్ కో భావిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా మొత్తం 8 స్థానాల్లో ఐదు స్థానాల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ విజ‌యం సాధించే అవ‌కాశం ఉంది. మ‌రో రెండు స్థానాలు బీజేపీ ఖాతాలో ప‌డ‌గా.. మ‌రో స్థానం మీద మాత్రం ఏమీ చెప్ప‌లేక‌పోతున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఏడాది యూపీలోని 9 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో 8 స్థానాల్ని బీజేపీ సొంతం చేసుకోనుంది. ఈనేప‌థ్యంలో బీజేపీకి పెరిగిన అధిక్య‌త అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే త‌ప్ప త‌గ్గే అవ‌కాశం క‌నిపించ‌టం లేదు. ఈ ప‌రిణామం కాంగ్రెస్‌కు ఇబ్బందిక‌రంగా మార‌నుంది. అయితే.. ఈ రికార్డు విష‌యంలో బీజేపీ నేత‌లు పెద్ద‌గా స్పందించ‌కుండా ఉండ‌టం గ‌మ‌నార్హం. రోటీన్ లో భాగంగానే ఈ ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌న్న మాట‌ను చెప్ప‌టం ద్వారా.. ప్ర‌జ‌ల్లో నెగిటివ్ భావ‌న రాకుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.