Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ మాట‌లెలా ఉంటాయో చెప్పే క‌ర్ణాట‌క‌

By:  Tupaki Desk   |   9 May 2018 2:53 PM IST
మోడీ బ్యాచ్ మాట‌లెలా ఉంటాయో చెప్పే క‌ర్ణాట‌క‌
X
మైకు క‌నిపించినంత‌నే రంకెలు వేసేయ‌టం.. ఆవేశప‌డిపోవ‌టం.. ఏదేదో చెస్తామ‌ని చెప్పేయ‌టం అన్న‌ది పాత‌కాల‌పు రాజ‌కీయం. వేదిక మీద‌కు వ‌చ్చినంత‌నే అప్యాయంగా ప‌లుక‌రించ‌టం.. తానెంత సామాన్యుడిన‌న్న విష‌యాన్ని చెప్ప‌టం.. ప్ర‌ధానే అయినా కించిత్ అహంకారం లేన‌ట్లుగా నీతులు చెప్పే మాట‌లు విన్న ప్ర‌తి ఒక్క‌రికి మోడీలాంటి ప్ర‌ధాని అవ‌స‌రం భార‌త్‌కు అవ‌స‌ర‌మ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కానీ..ఆయన నాలుగేళ్ల పాల‌న‌ను రెగ్యుల‌ర్ గా ఫాలో అయ్యే వారికి ఆయ‌న మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య‌న ఏ మాత్రం పొంత‌న ఉండ‌ద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. అంతేనా.. మిగిలిన రాజ‌కీయ నాయ‌కుల మాదిరి కాకుండా చాలా తెలివిగా జ‌నాల మ‌న‌సుల్ని గెలుచుకునే ఆర్ట్ ఆయ‌న ఎంత‌లా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌సర‌మే లేదు.

తాజాగా జ‌రుగుతున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఇస్తున్న పేప‌ర్ యాడ్స్ చూసిన‌ప్పుడు.. మార్పు కావాలా? బీజేపీకే ఓటు వేయాల‌ని కోర‌టం ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. మ‌రి.. బీజేపీ తెచ్చే మార్పు ఏమిట‌న్న‌ది కాస్త త‌ర్క‌బ‌ద్ధంగా ఆలోచిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

నీతులు చెప్పే ఆ పార్టీకి త‌ర‌ఫున క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల్ని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. నేర చ‌రిత ఉన్న అభ్య‌ర్థులు ఎక్కువ‌గా ఏ పార్టీ నుంచి బ‌రిలో ఉన్నార‌న్న‌ది చూస్తే.. బీజేపీనే మొద‌ట‌గా క‌నిపిస్తుంది. మార్పు కోసం బీజేపీకి ఓటు వేయాల‌ని కోరే ఆ పార్టీ.. నేర‌చ‌రిత ఉన్న వారికి రాజ్యాధికారం ఇస్తే దివ్య‌మైన భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న సందేశాన్ని ఇస్తున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం క‌ర్ణాట‌క బ‌రిలో ఉన్న 224 మంది బీజేపీ అభ్య‌ర్థుల్లో 83 మంది నేర చ‌రిత ఉన్న వారే. త‌ర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుంది. ఆ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల్లో 59 మంది కేసుల బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే. ఇక‌.. అధికారం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న జేడీఎస్ నుంచి బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల్లో 41 మందిపై కేసులు ఉన్న‌ట్లుగా తేలింది. ఇదంతా చ‌దివాక నిత్యం నీతులు చెప్పే పార్టీల మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న అంత‌రం ఎంత‌న్న‌ది తెలుస్తుంది. మ‌రి.. నీతులు చెప్పి గోతులు త‌వ్వే వారికి ఓట్లు వేస్తారా? వారి కంటే తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండే వారికి క‌న్న‌డ ప్ర‌జ‌లు అధికారం ఇస్తారా? అన్న‌ది మ‌రో ఐదు రోజుల్లో తేలిపోనుంది.