Begin typing your search above and press return to search.

టార్గెట్ టీడీపీయేనా ?

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:00 AM GMT
టార్గెట్ టీడీపీయేనా ?
X
తాజాగా బీజేపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇదేలాగుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా నేతలందరూ కృషి చేయాలని చెప్పారట. అది కూడా ఎలాగంటే ముఖ్యమైన నేతలను ఆకర్షించి బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా రాబోయే ఎన్నికల్లో బీజేపీ+జనసేన అధికారంలోకి వచ్చేయాలని షా ఆదేశించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యమైన నేతలంటే అమిత్ షా ఉద్దేశ్యం టీడీపీ నేతలని చెప్పటమే.

ఎలాగంటే టీడీపీ + వైసీపీతో సమదూరం పాటించాల్సిందే అని షా స్పష్టంగా చెప్పేశారు. అధికారంలో ఉన్న వైసీపీని శత్రువుగా చూసినా బీజేపీ చేయగలిగిందేమీ లేదు. ఇక మిగిలింది బలహీనంగా ఉన్న టీడీపీ మాత్రమే. టీడీపీతో సమదూరం అంటే ఏమిటి ? ఏమిటంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తో పొత్తు ఉండదని స్పష్టం చేయటమే. ఎలాగూ టీడీపీతో పొత్తుండదు కాబట్టి ఆ పార్టీలోని ముఖ్యమైన నేతలను బీజేపీలోకి లాగేయమని చెప్పినట్లుగా అర్ధమవుతోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన నేతలను ఆకర్షించాలంటే ఏమిటర్ధం ? అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశాలు దాదాపు లేవనే అనుకోవాలి.

జనసేన ఎలాగూ మిత్రపక్షమే. పైగా జనసేనలో పవన్ కల్యాణ్ తో కలుపుకుని అంత ముఖ్యమైన నేతలెవరు లేరనే చెప్పాలి. ఇక్కడ ముఖ్యమైన నేతలంటే రాబోయే ఎన్నికల్లో గెలవగలిగే వాళ్ళని అర్ధం. ఇక మిగిలింది వామపక్షాలు మాత్రమే. వామపక్షాల నుండి బీజేపీలో చేరే నేతలు ఎలాగూ ఉండరు. అంటే ఇక మిగిలింది టీడీపీ మాత్రమే. 2019లో ఘోర ఓటమి తర్వాత టీడీపీలో నుండి కొందరు నేతలు బయటకు వచ్చేసి కమలం కండువా కప్పుకున్నారు.

టీడీపీ నుండి వచ్చి బీజేపీలో చేరినవారు కాకుండా ఇంకా టీడీపీలోనే కంటిన్యు అవుతున్నవారిలో బలమైన నేతలని అనుకున్నవారిని బీజేపీలోకి లాగేయాలని షా గట్టిగా చెప్పినట్లు సమాచారం. టీడీపీ నేతలని చెప్పకపోయినా స్టేట్ చీఫ్ సోమువీర్రాజు కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ముఖ్యమైన నేతలను బీజేపీలోకి చేర్చుకోమని అమిత్ షా చెప్పారంటే అర్ధమేంటి ? తాజాగా షా ఆదేశాలు చూస్తుంటే వీలైనంత తొందరలోనే టీడీపీ నేతలను ఆకర్షించేపని మొదలయ్యేట్లుంది.

2024లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయమై తమ్ముళ్ళల్లో ఎలాగూ ఆశలు లేవు. ఏదో మీడియా సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అని సీనియర్ నేతలు కొందరు చెబుతున్నా వాస్తవం ఏమిటో అందరికీ తెలుసు. టీడీపీకి భవిష్యత్తు ఉండదనే చర్చ తమ్ముళ్ళల్లోనే జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే కనీసం బీజేపీలో అయినా చేరితే ఎంతోకొంత రాజకీయంగా నిలదొక్కుకోవచ్చని తమ్ముళ్ళు అనుకుంటే అప్పుడు 2024లో పోటీ చేయటానికి టీడీపీకి గట్టి అభ్యర్ధులు దొరకటం కూడా కష్టమే.

తమ్ముళ్ళని బీజేపీలోకి ఆకర్షించే బాధ్యత మాజీ తమ్ముళ్ళు సీఎం రమేష్, సుజనా చౌదరి మీదే పెట్టినట్లున్నారు. మొత్తానికి తిరుపతి పర్యటనకు వచ్చిన షా టీడీపీకి టార్గెట్ గట్టిగానే పెట్టినట్లు కమలనాదులు చెప్పుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఏమవుతుందో చూడాల్సిందే.