Begin typing your search above and press return to search.

కాశ్మీర్ లో కాషాయ జెండా...?

By:  Tupaki Desk   |   20 March 2022 3:30 PM GMT
కాశ్మీర్ లో కాషాయ జెండా...?
X
జమ్మూ కాశ్మీర్ ఈ రోజుకీ భారత దేశానికి అత్యంత కీలకమైన రాష్ట్రం. ఈ దేశానికి నుదుట సింధూరంగా కాశ్మీర్ ఉంది. అలాంటి కాశ్మీర్ ఒక విధంగా సంపన్న రాష్ట్రం కూడా. అందుకే దాని కోసం పొరుగున ఉన్న దాయాది పాకిస్థాన్ గత ఏడున్నర దశాబ్దాలుగా అలుపెరగని యుద్ధం చేస్తూ వస్తోంది. ఇక మోడీ సర్కార్ 2019 ఆగస్ట్ లో 370 ఆర్టికల్ రద్దు చేసేంతవరకూ పాక్ ఉగ్రవాదం అక్కడ రెచ్చిపోయే సీన్ ఉండేది.

దానికి చెక్ పెడుతూ మోడీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దీంతో కాశ్మీర్లో ఎన్నో ఏళ్ళుగా ఉంటూ వచ్చిన వారికి కూడా ఇపుడు పౌరసత్వంతో పాటు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. మూడేళ్లుగా చూస్తే కాశ్మీర్ బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. కాశ్మీర్ లో ఉగ్రవాదం నెమ్మదించింది.

తాజాగా కాశ్మీర్ పై సమీక్ష చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక మీదట సీఆర్పీఎఫ్ బలగాల అవసరం కాశ్మీర్ కి ఉండబోదని కీలక ప్రకటన చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆ మధ్య జరిగిన కాశ్మీర్ జిల్లా పరిషత్తుల ఎన్నికల్లో కూడా ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. మొత్తం 75 సీట్లకు పైగా గెలుచుకుంది.

ఇక కాశ్మీర్ లో మిగిలిన అన్ని పార్టీలు కూడా ఒక కూటమి గా ఏర్పడి 100కు పైగా స్థానాలు సాధించాయి. అయితే వీటితో పాటే ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో గెలిచారు. ఇక ఆ ఎన్నికల తరువాత చూసుకుంటే కాశ్మీర్ లో రాజకీయ ముఖచిత్రంలో భారీ మార్పులు వచ్చాయి. కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఈ రోజుకీ పెద్ద పార్టీగా ఉన్నా క్రమంగా పట్టు కోల్పోతోంది. అదే టైం లో పీడీఎఫ్ కూడా గతం కంటే బాగా క్షీణిస్తూ వస్తోంది

ఇక జమ్మూలో తన బలాన్ని అంతకంతకు పెంచుకుంటున్న బీజేపీ కాశ్మీర్ లోయలో కూడా పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు ఈ మధ్య ఆ పార్టీలో వచ్చి చేరుతున్నారు. ఇక మరి కొన్ని చిన్న పార్టీలు కూడా కాశ్మీర్ లోయలో ఈసారి రాజకీయంగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాశ్మీర్ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లో నిర్వహిస్తారు అని అంటున్నారు. దాని కోసమే కేంద్రం కూడా అనేక రకాలైన చర్యలను తీసుకుంటోంది. త్వరలో ప్రజా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం పదే పదే చెబుతోంది. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది చివరరలో అంటే చలి కాలం ముదరకముందే ఎన్నికలు వస్తాయని అంటున్నారు.

ఈసారి దేశంలోని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు కాశ్మీర్ లో కూడా ఎన్నికలు ఉండబోతున్నాయి అని అంటున్నారు. గుజరాత్ ఎటూ బీజేపీదే. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఆ పార్టీ గెలుపునకు ఢోకా లేదు. ఇక కాశ్మీర్ ని గత మూడేళ్ళుగా ప్రత్యక్షంగా పరోక్షంగా నియంత్రిస్తూ వస్తున్న బీజేపీ ఫస్ట్ టైం కాశ్మీర్ లో కాషాయ జెండా ఎగరేస్తుంది అని అంటున్నారు. నేషనల్ కాంన్ఫరెన్స్ బలం తగ్గుతున్న క్రమంలో బీజేపీ దూకుడు తధ్యమని చెబుతున్నారు. అదే కనుక జరిగితే బీజేపీ కొత్త హిస్టరీ నమోదు చేయడం ఖాయం.