Begin typing your search above and press return to search.

ఏపీలో హంగ్ రావాలన్నదే టార్గెట్...బీజేపీ మాస్టర్ స్ట్రాటజీ...?

By:  Tupaki Desk   |   19 Nov 2022 2:30 AM GMT
ఏపీలో హంగ్ రావాలన్నదే టార్గెట్...బీజేపీ మాస్టర్ స్ట్రాటజీ...?
X
వచ్చే ఎన్నికల్లో ఏపీలో హంగ్ రావాలి. అలా జరిగితేనే ఫస్ట్ టైం కమలం పార్టీ జనసేనతో కూడి పవర్ లోకి వస్తుంది. ఇది మొదటి ఆప్షన్ గా పెట్టుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం మాస్టర్ స్ట్రాటజీని సెట్ చేసి పెట్టింది. ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగితే కచ్చితంగా హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

ఒక వైపు అధికార పార్టీగా వైసీపీ ఉంటుంది. మరో వైపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ ఉంటుంది. ఇక బీజేపీ జనసేనతో కలసి కూటమి కట్టి వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం తన శక్తియుక్తులను ఏపీ మీద పెట్టి పనిచేస్తుంది. అమిత్ షా వీలైతే మోడీ కూడా ఎక్కువసార్లు ఏపీకి వచ్చి కూటమి తరఫున ప్రచారం చేసి పెడతారు. అపుడు ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ భీకరంగా సాగడం ఖాయం.

ఎటూ జనసేన అధినేతను సీఎం క్యాండేట్ గా కూటమి ప్రకటించి ముందుకు సాగుతుంది. దాంతో ఒక బలమైన సామాజికవర్గం ఓట్లు పోలరైజ్ అవుతాయి. అలాగే ఇతర వర్గాలలోనూ కొత్త ఓట్లు కానీ కొత్త వర్గాలు కానీ ఎంతో కొంత మొగ్గు చూపినా ఈ కూటమి ముప్పయి నుంచి నలభై దాకా సీట్లను సాధిస్తుందని అంచనా వేసుకుంటున్నారు. అలా జరగాలని కూడా టార్గెట్ పెట్టుకుంటున్నారు.

అదే జరిగితే కచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా 88 సీట్లు ఏ పార్టీకి రావు. అపుడు హంగ్ ఏర్పడుతుంది. ఒక్కసారి కనుక ఏపీలో హంగ్ ఏర్పడితే కర్నాటకం తరహాలో కొత్త రాజకీయ నాటకం మొదలవుతుంది. అపుడు ఎక్కువ సీట్లు వచ్చిన వైసీపీ టీడీపీ ఉన్నా కూడా అన్ని రకాలుగా ఆ పార్టీల మీద రాజకీయ వత్తిడిలు పెరిగిపోతాయి. చివరికి సేనా బీజేపీ కూటమి ఏపీలో ఫస్ట్ టైం ఏర్పాటు కావడానికి ఆస్కారం దక్కుతుందని లెక్కలేస్తున్నారు.

ఇలా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో వేసిన రాజకీయ ఎత్తుగడలలో భాగమే పవన్ కళ్యాణ్ణి బీజేపీ తన వైపున ఉంచుకోవడం అని అంటున్నారు. పవన్ కి ఉన్న ఛరిష్మాకు తోడు బీజేపీ రాజకీయ వ్యూహాలు, అనుభవాలను మిక్స్ చేస్తే కనుక ఏపీలో అధికారం బంగారం పళ్లెం లో వచ్చి వాలుతుంది అని లెక్కలేస్తున్నారు.

ఇక మరో వైపు చూస్తే ఎన్నికల అనంతరం పొత్తులు కూడా ఉంటాయని చెబుతున్నారు. టీడీపీకి అపుడు ఎక్కువ సీట్లు వచ్చినా కూడా పవన్ కే సీఎం సీటు ఇవ్వాలని బేరం పెట్టి వీలైతే చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్ళి కేంద్ర మంత్రిని చేయడం ద్వారా ఈ పొత్తులకు కొత్త డెఫినిషన్ ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అంటే ఎన్నికల ముందు మాత్రం టీడీపీతో ఫైటింగ్ ఉన్నా అనంతరం పొత్తులకు బేరాలు ఆడేలా ఓటింగ్ సీటింగ్ తెచ్చుకోవాలన్నదే బీజేపీ ఎత్తుగడ. అందుకోసమే పవన్ ఒక్క చాన్స్ అంటున్నారు. ఆ రకమైన రోడ్ మ్యాప్ రెడీ కావడం వల్లనే జనసేనలోనూ ధీమా పెరిగింది అని చెబుతున్నారు.

ఒక విధంగా బీజేపీ మార్క్ స్ట్రాటజీ వల్ల ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలకూ రాజకీయంగా ఇబ్బందే అని అంటున్నారు. ఎలాగైనా ఏపీలో అధికారం సాధించాలని భావిస్తున్న బీజేపీ తమ కూటమికి ముప్పై సీట్లు దక్కినా చాలు ఏపీలో ముచ్చెమటలు పట్టించేలా రాజకీయం నడుపుతుంది అని గత అనుభవాలను ఇతర రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను బేరీజు వేసుకున్న వారు చెప్పే మాట. సో అలెర్ట్ కావాల్సింది చంద్రబాబు మాత్రమే కాదు జగన్ కూడా అన్నదే కేంద్ర పెద్దల దిశా నిర్దేశంలోని అసలైన సందేశం అని అంటున్నారు. ఇక మీదట ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.