Begin typing your search above and press return to search.

కుట్ర‌లు చేస్తుంటే సైలెంట్ గా ఉండ‌నన్న సీఎం

By:  Tupaki Desk   |   15 Sep 2018 7:50 AM GMT
కుట్ర‌లు చేస్తుంటే సైలెంట్ గా ఉండ‌నన్న సీఎం
X
ఓవైపు ప్ర‌జ‌ల్లో అసంతృప్తి మ‌రోవైపు సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు జోరుగా సాగుతున్న ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో క‌ర్ణాట‌క రాజ‌కీయంలో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత పాల‌న‌లో త‌న‌దైన మార్క్ చూపించ‌టంలో కుమార‌స్వామి త‌ప్పుల మీద త‌ప్పులు చేయ‌టం ఒక ఎత్తు అయితే.. విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చేలా ఆయ‌న నిర్ణ‌యాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని ఏదోలా కూల‌గొట్టాల‌న్న ప్ర‌య‌త్నాలు చాప కింద నీరులా సాగుతున్నాయి.

ఇలాంటివేళ‌.. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు ప‌థ‌కం ర‌చిస్తున్న సూత్ర‌ధారులు ఎవ‌రో త‌న‌కు తెలుసున‌ని ఆయ‌న మండిప‌డ్డారు. త‌న ప్ర‌భుత్వాన్ని కూల‌దోసే ప్ర‌య‌త్నం చేస్తున్న వారెవ‌రో.. కుట్ర‌కు తెర తీసిన వారెవ‌రో త‌న‌కు తెలుస‌ని.. ఈ ప‌ని కోసం డ‌బ్బులు స‌మీక‌రిస్తున్న వారి వివ‌రాలు కూడా త‌న‌కు తెలుస‌ని స్ప‌ష్టం చేశారు.

తాను సైలెంట్ గా ఉంటాన‌ని అనుకుంటున్నారా? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న అలా ఎప్ప‌టికి జ‌ర‌గ‌ద‌ని విప‌క్ష బీజేపీని ఉద్దేశించి కుమార‌స్వామి వార్నింగ్ ఇచ్చారు. జ‌ర్కి హోలి సోద‌రులు త‌న‌తోనే ఉన్నార‌ని.. త‌న ప్ర‌భుత్వాన్ని ఎలా నిల‌బెట్టుకోవాలో త‌న‌కు బాగా తెలుస‌న్నారు.

బెల‌గావి రూర‌ల్ ఎమ్మెల్యే ల‌క్ష్మీ హెబాల్క‌ర్ తో విభేదాలు ఉన్న జ‌ర్కిహోలి సోద‌రులు పార్టీ నుంచి వెళ్లిపోవ‌టం ద్వారా కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి చాప కింద నీళ్లు తెచ్చే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఈ విష‌యాన్ని తాను గుర్తించిన‌ట్లుగా చెప్ప‌టంతో పాటు.. ప్ర‌భుత్వాన్ని కూల‌దోసే ప్ర‌య‌త్నాల్ని అడ్డుకోవ‌టానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి.. బీజేపీ ఎత్తుల‌కు కుమార‌స్వామి పైఎత్తులు ఎంత వ‌ర‌కూ వేస్తార‌న్న దానిపైనే ఆయ‌న ప్ర‌భుత్వానికి ఆయుష్షు ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.