Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీకి అధికారమంట...తెలంగాణాలో సెకండ్ ప్లేస్ వస్తుందా...?

By:  Tupaki Desk   |   26 Aug 2022 11:30 AM GMT
ఏపీలో బీజేపీకి అధికారమంట...తెలంగాణాలో సెకండ్ ప్లేస్ వస్తుందా...?
X
కమలనాధులు ఒక విషయాన్ని బాగా వంటబట్టించుకున్నారు. కడుపు నిండా కబుర్లు పెట్టుకుని బోల్డ్ గా భోళాగా మీడియా ముందు మాట్లాడేస్తే తమ రాజకీయ కధ సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్నారు. జనాలను ఆ విధంగా తమ వైపునకు తిప్పుకుంటున్నామని భావిస్తున్నారు. ఇప్పటిదాకా ఏపీని వచ్చిన బీజేపీ నాయకులు అంతా ఇదే చెబుతున్నారు. తాజాగా తెలంగాణాకు చెందిన నిజామాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అరవింద్ ఏపీలో టూర్ చేస్తూ తమాషా కామెంట్స్ చేశారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందిట. అది కూడా వైసీపీకి టీడీపీకి సమాన దూరం పాటిస్తూ తామే ఏపీకి ఏలుతామని ధీమాగా చెబుతున్నారు. ఇక జనసేన‌తో మాత్రమే పొత్తులు ఉంటాయని అంటున్నారు. నిజంగా అరవింద్ కి ఇంతటి ధీమా ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ బోల్డ్ స్టేట్మెంట్స్ ని చూసి ఎవరైనా పట్టించుకుంటారా అన్నదే ఇక్కడ చర్చ.

ఇక దీన్న్ని చూసిన ఏపీ జనాలు కానీ నెటిజన్లు కానీ చాలా చిత్రంగా స్పందిస్తున్నారు. ఏపీలో బీజేపీ అంట అని సెటైర్లు కూడా వేస్తున్నారు. ఫస్ట్ తెలంగాణాలో సెకండ్ ప్లేస్ లోకి రండి చూద్దాం అని అంటున్నారు ప్రజలు. ఇక తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్సెస్ టీయారెస్ అన్నట్లుగానే అక్కడ రాజకీయం మొత్తం కనిపిస్తోంది. దాంతో బీజేపీ బాగా వెనకబడుతోంది.

ఈసారి కనీసం రెండవ స్థానానికైనా తెలంగాణాలో వస్తే అపుడు ఏపీ గురించి ఆలోచించవచ్చు అని అంటున్నారు జనాలు. అర్జంటు గా ఏపీలో అధికారంలోకి వస్తామని చంకలెగరేస్తున్న బీజేపీ నేతలకు అక్కడ 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు పడిన సంగతిని మరచిపోతే ఎలా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఏపీలో బీజేపీకి అంత సీన్ అయితే లేదు అనే జనాలు చెప్పేస్తున్నారు. ఏపీని అడ్డగోలుగా విభజన చేసి ఎనిమిదేళ్ళు గడచినా ఏ ఒక్కవిభజన హామీని తీర్చకుండా అనేక సమస్యలను కుప్ప పోసినట్లుగా చేసిన బీజేపీ జనాలకు ఎన్నో సమాధానాలు చెప్పాలని కూడా అంటున్నారు.

ఇకపోతే బీజేపీ ఎంపీ అయి పొరుగు రాష్ట్రంలోనే ఉంటున్న అరవింద్ కి ఏపీ రాజకీయం ఆ మాత్రం తెలియదా అని కూడా అంటున్నారు. ఇపుడు అర్జంటుగా ఏపీలో బీజేపీ అధికారం లోకి రాకపఒయినా నష్టం ఏమైనా ఉందా మాస్టారూ అని అంటున్నారు. 2019లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడేళ్ళుగా కేంద్రానికి మంచి నేస్తంగానే ఉంటోంది కదా. సీబీఐ కేసుల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ వైసీపీ ధీటుగా కేంద్రాన్ని నిలదీయలేకపోతోంది కదా అని నెటిజన్లు అంటున్నారు.

అలాగే టీడీపీ 2019 ఎన్నికల ముందు అయితే బీజేపీని విమర్శించింది కానీ ఆ తరువాత నోటికి తాళం వేసుకుంది. ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీని సమర్ధిస్తూ ఆ పార్టీ చెలిమి కోసం పడరాని పాట్లు పడుతోంది కదా అని గుర్తు చేస్తున్నారు. ఒక వైపు ఏపీకి విభజన హామీలు తీర్చకపోయినా పోలవరం ప్రాజెక్టును ఏమీ కాకుండా చేస్తున్నా, అలాగే స్టీల్ ప్లాంట్ ని అడ్డగోలుగా అమ్మేయడానికి చూస్తున్నా వైసీపీ కానీ టీడీపీ కానీ ఏమీ అనడంలేదు కదా అని గుర్తు చేస్తున్నారు.

ఇక రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు అన్ని బిల్లులకు కూడా వైసీపీ టీడీపీ కేంద్రానికి మద్దతు ఇస్తున్న వేళ ప్రత్యేకంగా ఏపీలో బీజేపీ సర్కార్ ఉండాలా అరవింద్ సారూ అని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల మీ పాట్లేవో తెలంగాణాలో పడండి, అక్కడ బీజేపీకి ఏ ప్లేస్ జనాలు ఇవ్వబోతున్నారో ఒకటికి రెండు సార్లు చూసుకుని జాగ్రత్త పడండి అని నెటిజన్లు ఒక్క లెక్కన వేసుకుంటున్నారు. సో అదండీ మ్యాటర్. ఆరాటం ఉండాలి కానీ అది అతి అయిపోకూడదు అన్నదే ఇపుడు నయా రాజకీయ నీతి. మరి దాన్ని దాటుతామని బీజేపీ అనుకుంటే ఎవరూ చేసేది కూడా ఉండదని అంటున్నారు.