Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి అంటూ ఉదరగొట్టేశారు.. ఇప్పుడు ఉప రాష్ట్రపతి అంటున్నారు.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   13 July 2022 8:30 AM GMT
రాష్ట్రపతి అంటూ ఉదరగొట్టేశారు.. ఇప్పుడు ఉప రాష్ట్రపతి అంటున్నారు.. ఏం జరుగుతోంది?
X
ఎవరో ఏదో అంటారని.. మరేదో అనేస్తారంటూ వెనుకా ముందు చూసుకోవటం.. తొందరపాటుకు గురి కాకపోవటం లాంటి లక్షణాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో మచ్చుకు కనిపించవు. ఆయన ఒకసారి డిసైడ్ అయ్యాక.. ఆ విషయంలో ఎవరేం అనుకున్నా లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్లటమే తప్పించి.. వెనక్కి అడుగు వేయటం అన్నది కనిపించదు. ప్రధాని మోడీ మైండ్ సెట్ గురించి బాగా తెలిసినవారంతా ఒక విషయాన్ని తరచూ ప్రస్తావిస్తుంటారు. తనకు మించిన ఇమేజ్.. మరే నేతకు ఉండకూడదన్నట్లుగా మోడీ మైండ్ సెట్ ఉంటుందని చెబుతారు. ఈ కారణంతోనే బీజేపీలో ఇప్పుడు ప్రముఖంగా కనిపించే నేతలే ఉండరు.

ఎవరి దాకానో ఎందుకు.. తనకు గురువు.. ఈ రోజున మోడీ ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణమైన బీజేపీ కురు వృద్ధుడు లాల్ క్రిష్ణ అద్వానీ సంగతేమైంది. హైదరాబాద్ మహానగరంలో అర్భాటంగా నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. పెద్ద వయసు.. అనారోగ్యం కారణంగా అని సరిపెట్టుకున్నా.. కనీసం ఆయన ఫోటోలు ప్రచార చిత్రాల్లోనూ.. భారీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ కనిపించాలి కదా? ఎక్కడా అద్వానీ ఫోటోను కనిపించకుండా ఉండటం తెలిసిందే.

సొంత పార్టీ నేతలు.. తనకు రాజకీయ గురువులైన వారి విషయంలోనూ ఇంత నిక్కచ్చిగా ఉండే మోడీ.. తన సమకాలీనుల విషయంలో మరెంత కటువుగా ఉంటారో ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి పదవి కోసం పార్టీకి అత్యంత సీనియర్.. గడిచిన ఐదేళ్లుగా (దగ్గర దగ్గర) ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడి పేరును వినిపించింది. దీనిపై పెద్ద ఎత్తున కథనాలు మీడియాలో వచ్చాయి.

అయితే.. అలాంటి అవకాశం లేకపోవచ్చన్న మాట వినిపించినా.. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు.కానీ.. ఇప్పుడు అదే నిజమైంది. రాష్ట్రపతి పదవికి అన్ని అర్హతులు ఉన్నా.. వెంకయ్యకు కాకుండా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించటం ద్వారా.. ఎవరూ మాట్లాడలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలాంటి టాలెంట్ మోడీకి ఎక్కువనే చెప్పాలి. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను పలువురు ప్రస్తావించినప్పటికీ అదేమీ వాస్తవ రూపం దాల్చని నేపథ్యంలో.. ఇప్పుడు మీడియాలో కొత్త తరహా కథనాలు వస్తున్నాయి. వాటి సారాంశం ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడ్ని రెండో దఫా కంటిన్యూ చేస్తున్నారని. ఒకవేళ కుదరకుంటే.. తమిళ సైకు అవకాశం దక్కుతుందని.

గతంలోనూ ఇదే కాంబినేషన్ లో రాష్ట్రపతి పదవికి వీరిద్దరి పేర్లు వినిపిస్తున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే.. దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయటంలో భాగంగా వెంకయ్యకు మరో అవకాశం.. తమిళ సైకు ఫ్రెష్ గా ఛాన్సు ఇస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. రానున్న ఒకట్రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన సస్పెన్స్ వీడుతుందని చెబుతున్నారు.

ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యులైన.. ప్రధాని మోడీ.. కేంద్ర మంత్రులు అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్.. నితిన్ గడ్కరీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిశివరాజ్ సింగ్ చౌహాన్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లు ఉన్నారు. వీరంతా సమావేశమై ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది తేలుస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. వెంకయ్యకు మరోసారి ఉపరాష్ట్రపతి పదవి అంటే మాత్రం.. కచ్ఛితంగా సంచలన వార్తే అవుతుందన్న మాట వినిపిస్తోంది. మోడీ మరేం చేస్తారో చూడాలి.