Begin typing your search above and press return to search.

బీజేపీ అలా.. పవన్ కల్యాణ్ ఇలా..!

By:  Tupaki Desk   |   30 May 2022 6:30 AM GMT
బీజేపీ అలా.. పవన్ కల్యాణ్ ఇలా..!
X
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అని ఒక సామెత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఈ సామెత వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ - బీజేపీ పార్టీల మధ్య ప్రస్తుతం పొత్తు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటించనుందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఈలోపుగానే.. అంటే ఈ వచ్చే జూన్ లోనే పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే.. తమ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం కల్పించకూడదని బీజేపీ తలపోస్తోంది. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని చెబుతున్నారు. దీన్ని బట్టి పవన్ ఉద్దేశం బీజేపీ-జనసేన-టీడీపీ కలసి పోటీ చేయాలని పేర్కొంటున్నారు. ఇంకోవైపు బీజేపీ మాత్రం తమ కూటమిలో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని కోరుకుంటోంది.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాలేవీ కలసి పోటీ చేయకూడదని బలంగా అనుకుంటోంది. వేటికవే విడిగా పోటీ చేయాలని ఆశిస్తోంది. ఇలా ఆయా పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తమకు లాభం చేకూరుతుందని వైఎస్సార్సీపీ ఆశిస్తోంది. కాగా బీజేపీ-జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటిస్తే జనసేన వర్గాల్లో ఇక ఫుల్ జోష్ ఖాయం.

జూన్ 7న రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ ను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలోనూ ఇప్పటికే ప్రముఖంగా వార్తలు రావడం గమనార్హం. ప్రజల్లో, ఇరు పార్టీల నాయకులు, పార్టీ కార్యకర్తల్లో ఎలాంటి అయోమయం, సందేహాలు లేకుండా ఉండటానికి బీజేపీ జాతీయ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ వచ్చే రెండేళ్లు మరింత చురుగ్గా ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేసి అధికారంలోకి రావచ్చని జనసేన, బీజేపీలు భావిస్తున్నాయి. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇరు పార్టీల కార్యకర్తల్లోనూ జోష్, ఉత్సాహం వస్తాయని బీజేపీ నమ్ముతోంది. అందులోనూ రాష్ట్రంలో అత్యధికంగా 27 శాతం ఉన్న కాపు సామాజికవర్గం మొత్తాన్ని, పవన్ కల్యాణ్ అభిమానులను, బీజేపీకి పట్టు ఉన్న అగ్ర కులాలను కూటమికి దగ్గర చేయొచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ కాపు సామాజికవర్గానికే చెందిన సోము వీర్రాజు ఉన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారేనన్న సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటకలో మాదిరిగా అద్భుతాలు జరుగుతాయని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏకైక అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న కాపులకు పెద్దపీట వేస్తే తాము ఇక్కడ కూడా అధికారంలోకి రావచ్చని బీజేపీ భావిస్తోంది. బీజేపీ ముఖ్యులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం పవన్ కల్యాణ్ చరిష్మా మీద భారీ ఆశలు పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాక ఏపీలో పవన్ తో భారీ బహిరంగ సభలు నిర్వహింపజేయడానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాల్లో సభలు నిర్వహిస్తారని అంటున్నారు. బీజేపీ ప్రతిపాదలనకు పవన్ కల్యాణ్ అంగీకరిస్తే ఇక కార్యాచరణ మొదలైనట్టేనని పేర్కొంటున్నారు. తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయొచ్చని నమ్ముతున్నారు.