Begin typing your search above and press return to search.

ఈశాన్యంలో బీజేపీ పోల్ స్ట్రాట‌జీ మారిందండోయ్‌!

By:  Tupaki Desk   |   28 March 2017 5:47 AM GMT
ఈశాన్యంలో బీజేపీ పోల్ స్ట్రాట‌జీ మారిందండోయ్‌!
X
నిజ‌మే... వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతోన్న భార‌తీయ జ‌నతా పార్టీకి... ఆది నుంచి అవ‌లంబిస్తూ వ‌స్తున్న భావ‌జాలం కంటే కూడా గెలుపే ముఖ్య‌మైపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇటీవ‌ల ముగిసి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మిశ్ర‌మ ఫ‌లితాల‌ను సాధించిన బీజేపీ... ఐదింటిలో పంజాబ్ మిన‌హా నాలుగు రాష్ట్రాల పాల‌నా ప‌గ్గాల‌ను ఒడిసిప‌ట్టేసింది. వీటిలోనూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో చాలా కాలం త‌ర్వాత అధికారం చేతికంద‌డం ఆ పార్టీ నేత‌ల్లో హ‌ర్షం వ్య‌క్తమ‌వుతోంది. ఈ హ‌ర్షాతికేరం ఏ త‌ర‌హాలో ఉందంటే... అధికారం అందీ అంద‌గానే... ఆ రాష్ట్ర సీఎం హోదాలో సింగిల్ అధికారిక ఉత్త‌ర్వు లేకుండానే... త‌మ భావ‌జాలాన్నీ అమ‌లు చేసేందుకు రంగంలోకి దిగిన ఆదిత్య‌నాథ్ యోగీ... జంతు వ‌ధ శాల‌ల‌పై స‌మ‌రం ప్ర‌క‌టించారు. అనుమ‌తి లేని వ‌ధ‌శాల‌లే ల‌క్ష్య‌మంటూ యోగీ ప్ర‌భుత్వం చెబుతున్నా... బీజేపీ అంతిమ ల‌క్ష్యం గోవ‌ధ‌ను స‌మూలంగా నిర్మూలించ‌డ‌మేన‌న్న వాద‌న లేక‌పోలేదు. యోగీ నిర్ణ‌యంతో ప్ర‌స్తుతం యూపీలో జంతు వ‌ధ శాల‌ల‌న్నీ దాదాపుగా మూత‌ప‌డిపోయాయి. మాంసం విక్రేత‌లంతా త‌మ షాపులు మూసేసి రోడ్ల‌పైకి వ‌చ్చేశారు. నేడో, రేపో చేప‌ల వ్యాపారులు కూడా వారితో చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లకు సంబంధించి బీజేపీ వైఖ‌రిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాల్సి ఉంది. ఎందుకంటే.. క్రైస్తవులు మెజారిటీగా ఉన్న నాగాల్యాండ్‌ - మిజోరాం - మేఘాల‌య రాష్ట్రాల్లో వారి ఓట్లే కీల‌క‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ రాష్ట్రాల్లో క్రైస్త‌వులు స‌హా 80 మంది మాంసాహారులేన‌ట‌. మరి అక్క‌డ కూడా యూపీలో అవ‌లంబించిన మాదిరే జంతు వ‌ధ‌శాల‌ల‌పై నిషేధం విధిస్తామ‌ని బీజేపీ చెబుతుందా? అంటే... ముమ్మాటికీ లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... క‌మ‌ల ద‌ళంగా పేరుప‌డ్డ ఆ పార్టీకి త‌న స్ట్రాట‌జీని కొన‌సాగించ‌డం కంటే కూడా గెలుపే ప‌ర‌మావ‌ధి అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో ఎన్న‌డూ ఈ త‌ర‌హా వైఖ‌రితో ముందుకు వెళ్లని ఆ పార్టీ... మోదీ కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాతే ఈ త‌ర‌హా వైఖ‌రికి మారుతుండ‌టంపై ఇప్పుడు స‌ర్వ‌త్ర చ‌ర్చ‌కు తెర లేచింది. ఈశాన్య రాష్ట్రాల్లో జంతు వ‌ధ శాల‌ల మూత అన్న మాటే లేకుండా ఎన్నిక‌ల‌కు వెళ‌తామ‌ని ఆ పార్టీకి చెందిన స‌ద‌రు రాష్ట్రాల చీఫ్ వ‌రుస పెట్టి మ‌రీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. ఇక కేంద్రంలో మోదీ కేబినెట్‌లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్ కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఇక ఈశాన్య రాష్ట్రాల‌కు సంబంధించిన బీజేపీ చీఫ్ లు ఏమ‌న్నారో చూస్తే... వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే విష‌యంలో తాము ప‌క్కా వ్యూహంతోనే ముందుకు వెళుతున్నామ‌ని నాగాల్యాండ్ బీజేపీ చీఫ్ విసాసోలీ లాంగూ చెప్పారు. యూపీలో త‌మ పార్టీ అవ‌లంభించిన గోవ‌ధ నిషేధం నినాదం నాగాల్యాండ్‌లో పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌బోద‌నే భావిస్తున్నామ‌ని చెప్పిన ఆయ‌న‌... ఇక్క‌డ అందుకు పూర్తి విరుద్ధంగానే ముందుకు వెళ‌తామ‌ని, ఈ విష‌యంపై పార్టీ కేంద్ర నాయ‌క‌త్వానికి కూడా పూర్తి స్ప‌ష్ట‌తే ఉంద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. క్రైస్త‌వులు ఎక్కువ‌గా ఉన్న త‌మ రాష్ట్రంలో జంతు వ‌ధ‌శాల‌ల‌పై నిషేధం ప‌నికి రాద‌ని కూడా ఆయ‌న తేల్చేశారు.

ఇక మేఘాల‌య బీజేపీ చీఫ్ శిబున్ లింగ్డో విష‌యానికి వ‌స్తే... యూపీలో నిబంధ‌న‌లకు విరుద్ధంగా వెల‌సిన జంతు వ‌ధ శాల‌ల‌పైనే చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యాన్ని మ‌రిచిపోరాద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో గోవ‌ధ‌పై నిషేధం లేద‌ని చెబుతున్న ఆయ‌న‌.. జంతువుల వ‌ధ‌ను చ‌ట్ట‌బ‌ద్ధంగానే కాకుండా ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణంలో చేప‌ట్టాల‌న్న‌దే తమ భావ‌న అని పార్టీ స్ట్రాట‌జీకి కొత్త అర్థం చెప్పుకొచ్చారు. అభివృద్ధి మంత్రాన్ని జ‌పిస్తున్న కార‌ణంగానే తాము బీజేపీలో ఉన్నామ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. నానాటికీ పార్టీకి అనుకూల వాతార‌ణం పెరుగుతోంద‌ని, వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధిస్తామ‌ని కూడా లింగ్డో చెప్పారు.

ఇక మిజోరాం బీజేపీ చీఫ్ జేవీ హ్లూనా విష‌యానికి వ‌స్తే... ఈయ‌న కూడా పై ఇద్ద‌రి మాదిరే స్పందించారు. అంతేకాదండోయ్... పైన చెప్పిన ఇద్ద‌రి కంటే కూడా ఈయ‌న కాస్తంత ధైర్యంగానే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఒక్క మిజోరాంలోనే కాకుండా ఈశాన్య భార‌తానికి చెందిన రాష్ట్రాల్లో గోవ‌ధ నిషేధ‌మ‌న్న‌దే లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. క్రైస్త‌వులు మెజారిటీగా ఉన్న ఈ రాష్ట్రాల్లో గోవ‌ధ నిషేధం అస‌లు ప‌నికి రాద‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్ కూడా.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసి బీజేపీ భ‌విష్య‌త్ వ్యూహాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెప్పేశార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. యూపీలో కేవ‌లం అనుమ‌తులు లేని జంతు వ‌ధ‌శాల‌ల‌ను మాత్ర‌మే మూయించే దిశ‌గా యోగీ స‌ర్కారు ముందుకు వెళుతోంద‌ని, అనుమ‌తులు ఉన్న వ‌ధ‌శాల‌ల‌పై మాత్రం తాము ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే... విజ‌యం కోసం బీజేపీ ఎంత‌వ‌ర‌కైనా దిగ‌జారే అవ‌కాశాలున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/