Begin typing your search above and press return to search.

ఏపీలో కమలం శవాసనం!

By:  Tupaki Desk   |   2 Feb 2018 3:30 PM GMT
ఏపీలో కమలం శవాసనం!
X
కొన్ని యాదృచ్ఛికమైన సంగతులు.. అంటే కోఇన్సిడెంటల్ గా జరిగే విషయాలు ఇలాగే ఉంటాయి. ఢిల్లీలో ఒకవైపు బడ్జెట్ ప్రతిపాదనలు వచ్చాయి. అదే రోజున తెలుగు రాష్ట్రాలతో కలిపి దక్షిణాదిలో బాగా బలపడడం గురించి భాజపా అధ్యక్షుడు అమిత్ షా నాయకులతో సమావేశం అయ్యారు. అయితే ఆ సమావేశంలో బలపడే మార్గాల గురించి చర్చించారు గానీ.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు బడ్జెట్ కేటాయింపులు.. పార్టీ విస్తరణ ఆశలకు శాశ్వతంగా సమాధి కట్టేసినట్టే తయారయ్యాయి. న్యాయం లేకుండా రాష్ట్రాన్ని విభజించినందుకే కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్రంలో నామ రూపాలు లేకుండాపోయిందని చంద్రబాబునాయుడు.. తమ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో శకునాలు పలుకుతున్నారు. అన్యాపదేశంగా ఇలాంటి కేటాయింపుల వల్ల భాజపాకు కూడా అదే పరిస్థితి తప్పదని చంద్రబాబునాయుడు హెచ్చరిస్తున్నట్లుగా ఉంది.

బాబు మాటలు ఎలా ఉన్నా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మాత్రం అదే. ఉమ్మడి తెలుగురాష్ట్రం నాటి పరిస్థితి గుర్తుచేసుకుంటే తెలంగాణ ప్రాంతంలో తప్ప భాజపాకు సొంత బలం అంటూ ఎక్కడా లేదు. రాష్ట్రం విభజన తర్వాత.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఎవరు ఎవరికి ఉపయోగపడ్డారనే సంగతి పక్కన పెడితే.. ఏపీలో అసలు రాజకీయ అధికారాన్ని పంచుకోవడం, కేబినెట్ పదవులు అలంకరించడం భాజపాకు సాధ్యమైంది.

ఈలోగా మరో రకంగా ఆ పార్టీకి కాలం కలసివచ్చింది. అప్పటికే విభజన పుణ్యమాని ఏపీలో కాంగ్రెస్ పార్టీ శవాసనం వేసిన స్థితిలో.. అక్కడినుంచి తెదేపాలోకి - వైకాపాలోకి వెళ్లడానికి గతిలేని నాయకులంతా భాజపా పంచన చేరారు. నాయకుల బలం పుష్కలంగానే కనిపించింది. తమ బలం పెరిగిపోయిందని భాజపా విర్రవీగడం మొదలైంది. నిజానికి నాయకుల బలం అంతో ఇంతో ఉన్నదే తప్ప.. ఆ పార్టీకి వాస్తవ ప్రజాబలం ఇప్పటికీ గతంలో కంటె ఒక్కశాతం కూడా పెరగలేదన్నది వాస్తవం.

ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను బజారు పాల్జేస్తున్నట్లుగా.. చులకన చేస్తున్నట్లుగా.. కావాలనే కించపరుస్తున్నట్లుగా జరిగిన కేంద్ర బడ్జెట కేటాయింపుల పట్ల ప్రజల్లో కూడా ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిణామాలు.. రాష్ట్రంలో భాజపాకు కూడా ప్రతికూల పరిస్థితిగా మారుతాయనే అందరి అంచనా. భాజపా కూడా శవాసనం వేయడానికి దగ్గర్లోనే ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రం బడ్జెట్ కేటాయింపులు అమోఘం అంటూ రాష్ట్ర భాజపా నాయకులు బాకా ఊదుతూ బతకవచ్చు గాక.. కానీ ప్రజలు అమాయకులు కాదు.. ఎక్కడ ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు.