Begin typing your search above and press return to search.

మోడీ షాల‌కు భారీ షాకిచ్చిన యూపీ ఓట‌ర్లు

By:  Tupaki Desk   |   14 March 2018 7:41 AM GMT
మోడీ షాల‌కు భారీ షాకిచ్చిన యూపీ ఓట‌ర్లు
X
త‌మ‌కు మించిన పోటుగాడు లేడ‌ని మిడిసి ప‌డిన ప్ర‌తిసారీ ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వు. గెలుపు అయినా ఓట‌మి అయినా తాత్కాలిక‌మే. ఈ రెండు శాశ్వితం చేసుకున్న వారు ఈ భూప్ర‌పంచంలో ఎవ‌రూ ఉండ‌రు. ఆ చిన్న లాజిక్ ను మిస్ అయిన ప్ర‌తి విజేత త‌ర్వాతి కాలంలో ప‌రాజిత‌గా మారిన వైనం చ‌రిత్ర‌లో క‌నిపిస్తుంది.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భారీ మెజార్టీతో అధికారాన్ని సొంతం చేసుకున్న మోడీ.. గ‌డిచిన నాలుగేళ్లుగా ఎంత‌గా విస్త‌రించారో తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మేజిక‌ల్ గెలుపు వెనుక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ల‌భించిన భారీ అధిక్య‌మే కార‌ణం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత ఒక్కొక్క రాష్ట్రంపై గురి పెడుతూ.. దేశ వ్యాప్తంగా భారీగా విస్త‌రించిన బీజేపీలో.. ఇటీవ‌ల అహంభావం పెరిగిపోయింద‌న్న తీవ్ర విమ‌ర్శ‌ను ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌న విడుద‌లైన ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ మెరుగైన ఫ‌లితాలు సాధించ‌టంతో త‌మ‌కు తిరుగులేద‌న్న భావ‌న క‌మ‌ల‌నాథుల్లో మ‌రింత పెరిగింది.

ఇలాంటి వేళ‌.. తాము అధికారంలో ఉన్న యూపీ.. బీహార్ లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వెలువ‌డుతున్న ఫ‌లితాలు షాకింగ్ గా మారాయి. మరి ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వెలువ‌డుతున్న ఫ‌లితాలు క‌మ‌ల‌నాథుల‌కు క‌రంట్ షాక్ కొట్టిన‌ట్లుగా మారాయి. త‌మ‌కు చెందిన రెండు స్థానాల్లో విప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీ విజ‌యం దిశ‌గా దూసుకెళ్ల‌టం ఇప్పుడు మింగుడుప‌డ‌నిది మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. యూపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన యోగి అదిత్య‌నాథ్ ప్రాతినిధ్యం వ‌హించిన కంచుకోట లాంటి గోర‌ఖ్ పూర్ లో స‌మాజ్ వాదీ అభ్య‌ర్థి విజ‌యం దిశ‌గా వెళ్ల‌టం బీజేపీకి ముచ్చ‌మ‌ట‌లు పోయించేదిగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డైన రౌండ్ల‌ల్లో గోర‌ఖ్ పూర్.. ఫుల్పూరుల‌లో స‌మాజ్ వాదీ పార్టీ అధిక్యంలో సాగుతోంది.

యూపీకి జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఎంపీగా ఉన్న యోగిని ముఖ్య‌మంత్రిగా చేయ‌టంతో.. ఆయ‌న ఎంపీగా ఉన్న గోర‌ఖ్ పూర్ స్థానానికి తాజాగా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో స్థానమైన పుల్పుర్ నుంచి ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌కేశవ్ మౌర్య యూపీ డిప్యూటీ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లోనూ బీజేపీ వెనుక‌బ‌డి ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

మ‌రోవైపు బీహార్ లో మూడు స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో రెండింటిలో బీజేపీ అధిక్య‌త‌లో ఉండ‌గా మ‌రోస్థానంలో ఆర్జేడీ అధిక్య‌త ప్ర‌ద‌ర్శిస్తోంది. వాస్త‌వానికి మ‌ధ్య‌హ్నాం 12 గంట‌ల వ‌ర‌కూ బీహార్ లోని రెండు స్థానాల్లో ఆర్జేడీ అధిక్య‌త‌లో సాగ‌గా.. త‌ర్వాత బీజేపీ అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. మొత్తంగా తాజా ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీకి భారీ షాక్ ను ఇచ్చేలా మారనున్నాయా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.