Begin typing your search above and press return to search.

బీజేపీకి షాక్ తప్పదా ?

By:  Tupaki Desk   |   2 March 2022 5:30 AM GMT
బీజేపీకి షాక్ తప్పదా ?
X
మణిపూర్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం చాలా అయోమయంగా తయారైపోయింది. ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటి వస్తుందని గ్యారెంటీ కనబడటంలేదు. తామే అధికారంలోకి వచ్చేస్తామని పార్టీలు చెప్పుకుంటున్నా క్షేత్రస్ధాయిలోని పరిస్దితులు చూస్తుంటే అంత సీన్ లేదని అర్ధమైపోతోంది. 2017 ఎన్నికల్లో 27 సీట్లతో సింగిల్ లార్జెస్టు పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. దీని తర్వాత 21 సీట్లతో బీజేపీ నిలబడింది. అయితే చిన్నా చితకా పార్టీలతో బీజేపీ జట్టుకట్టి కాంగ్రెస్ ను దెబ్బకొట్టి అధికారంలోకి వచ్చేసింది.

ఈ ఎన్నికల్లో ఎవరితోను పొత్తులు లేకుండా తామే 30 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వస్తామని చెబుతోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పదే పదే చెబుతున్నారు. అయితే ఎవరెన్ని మాటలు చెప్పినా ఏ పార్టీకి కూడా సరిపడా మెజారిటి వస్తుందనే నమ్మకాలు కనబడటంలేదు. పైకి అధికారంలోకి వచ్చే విషయంలో ఇన్నిమాటలు చెబుతున్న జాతీయపార్టీలో లోలోపల మాత్రం నాగా పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) తో జట్టుకట్టేందుకు చర్చలు జరుపుతున్నాయట.

నిజానికి సింగిల్ లార్జెస్టు పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించాలి. కానీ పోయిన ఎన్నికల్లో గవర్నర్ ఆపని చేయకుండా బీజేపీని ఆహ్వానించటం పెద్ద వివాదమైంది. అయితే కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్రస్ధాయిలో కాంగ్రెస్ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మళ్ళీ అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఇప్పటి నుండే పై రెండు ప్రాంతీయ పార్టీలతోను కాంగ్రెస్ మంతనాలు జరుపుతున్నదట.

దీన్ని బట్టే ఈ ఎన్నికల్లో కూడా సంకీర్ణ ప్రభుత్వం తప్సదనే అనిపిస్తోంది. అయితే బీజేపీకి సమస్య ఏమిటంటే సింగిల్ గా తాను అధికారంలోకి రావటం ఖాయమన్న నమ్మకంతో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోలేదు. పైగా అధికారంలో భాగస్వాములైన పార్టీలను కూడా వదిలేసుకున్నది. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ నేతలు స్పీడుగా ఆలోచించి పోయినసారి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఎవరి భవిష్యత్తు ఏమిటో ఈనెల 10వ తేదీన తేలిపోతుంది.