Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి దాటాక సీఎం ప్ర‌మాణ‌స్వీకారం..ఎందుకంటే?

By:  Tupaki Desk   |   19 March 2019 10:54 AM GMT
అర్థ‌రాత్రి దాటాక సీఎం ప్ర‌మాణ‌స్వీకారం..ఎందుకంటే?
X
ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టానికి మంచి ముహుర్తం అవ‌స‌ర‌మే. కానీ.. అర్థ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌టం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి సిత్రాలు మోడీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న వేళ‌లోనే సాధ్య‌మేమో. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారానికి.. ప్ర‌ధాన‌మంత్రికి సంబంధం ఏమిటి? బోడిగుండుకు మోకాలికి లింకుపెట్ట‌టం మామూలైంద‌ని మోడీ వీర‌భ‌క్తులు విరుచుకుప‌డొచ్చు. క‌ళ్ల‌కు ఎలాంటి రంగ‌ద్దాలు పెట్టుకోకుండా సాపేక్షంగా ఆలోచిస్తే.. ఇలాంటి సిత్ర‌విచిత్రాలు మోడీ హ‌యాంలోనే చోటు చేసుకున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆ మ‌ధ్య‌న సీబీఐ డైరెక్ట‌ర్ ను హ‌డావుడిగా అర్థ‌రాత్రి ఎంపిక చేయ‌టం.. ఆయ‌న‌కు డైరెక్ట‌ర్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయో లేదో.. అర్థ‌రాత్రి ఒంటి గంట వేళ ఆఫీసుకు వెళ్లి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టం.. ఆ వెంట‌నే..మోడీ స‌ర్కారుకు ఇబ్బంది క‌లిగిస్తున్నార‌న్న సీబీఐ ఉన్న‌త ఉద్యోగుల చాంబ‌ర్ల‌లో త‌నిఖీలు నిర్వ‌హించ‌టం.. ఈ ప్ర‌క్రియ ప‌క్క‌రోజు ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కూ సాగ‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.

ఆ త‌ర్వాతి కాలంలో స‌ద‌రు డైరెక్ట‌ర్ గారి నియామ‌కాన్ని సుప్రీం త‌ప్పుప‌ట్ట‌టాన్ని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదులెండి. ఈ నిర్ణ‌యంపై మోడీ ప‌రివారం చ‌ప్పుడు చేయ‌ని పరిస్థితి. ఎవ‌రిమీద‌నైనా అభిమానం ఉండ‌టంతో త‌ప్పు లేదు. కానీ.. వ్య‌వ‌స్థ‌ల్ని భ్ర‌ష్టు ప‌ట్టేలా నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు అభిమాన‌పు ప‌ర‌దాల్ని ప‌క్క‌న పెట్టేసిన తప్పు ఎత్తి చూపించ‌క‌పోతే.. రానున్న త‌రాల వారికి ఇలాంటి ఛండాల్ని స్ఫూర్తిగా తీసుకుంటే ప‌రిస్థితి ఏమిటి? మ‌న‌మెంతో గొప్ప‌గా చెప్పుకునే ప్ర‌జాస్వామ్యం మాటేంది?

ఆ విష‌యాన్ని అక్క‌డ పెట్టి తాజా వ్య‌వ‌హారంలోకి వ‌ద్దాం. గోవా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ అనారోగ్యంతో మ‌ర‌ణించ‌టం.. ఆయ‌న స్థానంలో ఎవ‌రు సీఎం అన్న విష‌యంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు చోటుచేసుకున్నాయి. అధికార బీజేపీతో పోలిస్తే.. విప‌క్ష కాంగ్రెస్‌ కు సీట్ల సంఖ్య అధికంగా ఉన్న వేళ‌.. సీఎం అయ్యే ఛాన్స్ త‌మ‌కే ఇవ్వాల‌ని ఆ పార్టీ ప‌ట్టు పడుతూ.. పావులు క‌ద‌ప‌టం షురూ చేసింది.

ఇలాంటి వేళ‌లో యాక్టివ్ అయిన బీజేపీ అధినాయ‌క‌త్వం.. బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చే రెండు మిత్ర‌ప‌క్షాల్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న ఒప్పించి.. ఒప్పందం చేసుకున్నాయి. గోవాలాంటి చిన్న రాష్ట్రానికి ఒక సీఎంతో పాటు ఇద్ద‌రు ఉప ముఖ్య‌మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారానికి ఏర్పాట్లు చేసేశారు. బీజేపీకి సీఎం ప‌ద‌వి.. ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చే రెండు మిత్ర‌ప‌క్షాల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని డిసైడ్ చేశారు. దీంతో.. ఈ ఒప్పందం లెక్క‌లో తేడా రాకుండా ఉండేందుకు వీలుగా.. సోమ‌వారం అర్థ‌రాత్రి.. అదేనండి మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున రెండు గంట‌ల వేళ‌లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మోద్ సావంత్ .. మ‌రో ఇద్ద‌రు ఉప ముఖ్య‌మంత్రులు ప్ర‌మాణ‌స్వీకారం చేసేశారు. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటివి కేంద్రంలో మోడీ లాంటి పెద్ద‌ మ‌నిషి కొలువు తీరిన వేళ‌లోనే సాధ్య‌మా? కాదా?