Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఉడికేలా టీఆర్ఎస్ కు కొత్త పేరు పెట్టిన నడ్డా

By:  Tupaki Desk   |   6 May 2022 2:29 AM GMT
కేసీఆర్ ఉడికేలా టీఆర్ఎస్ కు కొత్త పేరు పెట్టిన నడ్డా
X
కొద్ది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోవటమే కాదు.. అధికార పక్షం.. విపక్షం అన్న తేడా లేకుండా ఎవరికి వారు చేస్తున్న ఘాటు విమర్శల సంగతి తెలిసిందే. ప్రత్యర్థుల్ని తన మాటలతో ఇరిగేట్ చేసి.. ఆగ్రహంతో రగిలిపోయేలా చేసే టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడేలా.. ఆయన ఉడికిపోయేలా వ్యాఖ్యలు చేశారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. మహబూబ్ నగర్ లో నిర్వహించిన 'జనం గోస.. బీజేపీ భరోసా' పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నడ్డా.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో టీఆర్ఎస్ పార్టీకి సరికొత్త పేరు పెట్టేసిన వైనం షాకింగ్ గా మారింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రజాకార్ సమితిగా ఆయన అభివర్ణించారు. అవినీతి రాజకీయాలతో ప్రజల్ని కేసీఆర్ సర్కారు మోసం చేస్తుందంటూ విరుచుకుపడిన ఆయన.. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారుతో మరింత డెవలప్ కావొచ్చన్నారు.

ఈ సందర్భంగా మోడీ పాలన గొప్పతనాన్ని కీర్తిస్తూ.. కేసీఆర్ సర్కారు తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. వైద్యంలో మన దేశం కంటే మెరుగ్గా ఉంటే అమెరికా.. యూరోప్ దేశాల కంటే కూడా దేశంలోని 130 కోట్ల మంది ప్రజల్ని కరోనా నుంచి మోడీ రక్షించారన్నారు. అందరికీ టీకాలు ఇవ్వటం ద్వారా రక్షించారన్నారు. అంతేకాదు.. వంద దేశాలకు టీకాలు ఎగుమతి చేశారని.. అందులో 48 దేశాలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు.

కరోనా వేళ దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు మోడీ ఉచితంగా రేషన్ అందించారని.. గడిచిన రెండేళ్లలో 12 శాతం మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. దుబ్బాకలో ధమాకా జరిగిందని.. హుజూరాబాద్ లో హుజూర్ పడిపోయారని.. ఈ రెండు ఉదంతాలతో కేసీఆర్ భయపడ్డారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపునకు వచ్చారని.. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లుగా చెప్పారు. బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్ సర్కారు అత్యంత అవినీతి ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. సీఎం కేసఆర్ కు కొన్ని సందర్భాల్లో సార్ అంటే మండిపడతారు. అదే విధంగా ఆయనకు ఏ మాత్రం నచ్చని అంశాల్లో రజాకార్ మాట అన్నా.. నిజాంతో పోల్చినా ఆయన ఇట్టే ఉడికిపోతుంటారు. తాజాగా నడ్డా చేసిన వ్యాఖ్యల్నే తీసుకుంటే.. ఏ మాటలైతే కేసీఆర్ కు అస్సలు ఇష్టం ఉండదో.. వాటినే ప్రస్తావించిన నడ్డా గడుసుతనం చూస్తే.. గులాబీ బాస్ మీద పూర్తిస్థాయి యుద్దానికి కమలనాథులు పక్కా ప్లాన్ ను సిద్ధం చేసినట్లేనని చెప్పేయొచ్చు.