Begin typing your search above and press return to search.

ఈ లెక్క‌న ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్న‌ట్లే

By:  Tupaki Desk   |   23 Dec 2017 5:56 AM GMT
ఈ లెక్క‌న ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్న‌ట్లే
X
సాధార‌ణంగా అధికార పార్టీ నేత‌లు చేసే కామెంట్ల‌కు, ప్ర‌క‌ట‌న‌ల‌కు మిగ‌తావారి కంటే ఎక్కువ విశ్వ‌స‌నీయ‌త ఉంటుంది. ఎందుంకంటే కీల‌క‌మైన ప‌రిపాల‌న నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డంలో - వాటిని ప్ర‌భావితం చేయ‌డంలో వారి పాత్ర ముఖ్యం కాబ‌ట్టి. అందుకే ఆయా ముఖ్య‌మైన అంశాల‌ను బ‌ట్టి వారి స్పంద‌న‌ను చూసి ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతుందో ఓ అంచ‌నాకు వ‌స్తుంటారు. అలా తాజాగా తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌ అంచ‌నా మొద‌ల‌యింది.

ఈ అంచనా గ‌తంలో అధికార టీఆర్ ఎస్ పార్టీ చెప్పిన‌ట్లు ముంద‌స్తు హ‌డావుడితో అనుకోకండి. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ వ‌ల్ల!అవును. ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి ఆ పార్టీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లుగా ఉంది. ఈ మేర‌కు రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు సిగ్స‌ల్స్ అందిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ చేసిన కామెంట్లు - అందులోనూ ఢిల్లీ వేదిక‌గా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఈ మేర‌కు అంచనాలు వెలువ‌డుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు అంశాలను కేంద్రమంత్రులకు నివేదించేందుకు బీజేపీ నేతల బృందం ఢిల్లీకి వచ్చింది. పర్యాటక శాఖ మంత్రి అల్ఫోజ్‌ కన్నథామమ్‌ - గిరిజనశాఖ మంత్రి జువల్‌ ఓరంను కలిసి సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరారు. అనంతరం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు తదితరులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌ తెలంగాణభవన్‌ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలోని టీఆర్ ఎస్ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం త‌గ్గిపోయింద‌ని పేర్కొంటూ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నిలుపుకోవ‌డంలో స‌ర్కారు ఫెయిల‌యింద‌ని ఆరోపించారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టిస్తూ... ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కూడా తామె రెడీగా ఉన్నామ‌న్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీకి బీజేపీయే ప్ర‌త్యామ్యాయ‌మైన‌ద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందజేస్తే కీల‌క స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కేంద్ర‌మంత్రులు చెప్పార‌ని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. మేడారం జాత‌ర‌ను జాతీయ పండుగగా గుర్తించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రులు చెప్పారన్నారు. కేంద్ర ఉపరితల - రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు విజ్ఞప్తులు చేశామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో గిరిజన - లంబాడీల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ల‌క్ష్మ‌ణ్ డిమాండ్ చేశారు.