Begin typing your search above and press return to search.

సోము వీర్రాజుకు వాళ్ళే విలన్లు... ?

By:  Tupaki Desk   |   14 Aug 2021 8:41 AM GMT
సోము వీర్రాజుకు వాళ్ళే విలన్లు... ?
X
బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజుకు నోటి దూకుడు ఎక్కువ. అలాగే ఆయనకు వ్యూహాలు తక్కువ అని కూడా చెబుతారు. సోము వీర్రాజుని కేంద్ర బీజేపీ నాయకత్వం గుర్తించి ఏపీ పార్టీ పీఠాన్ని అప్పగించింది. అయితే ఆయన తన వరకూ శక్తివంచన లేకుండా బాగానే పనిచేస్తున్నారు. కానీ ఆయనకు అసలైన శత్రువులు సొంత పార్టీలోనే ఉన్నారని అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఏపీ బీజేపీని కమ్మ సామాజిక వర్గం శాసిస్తోంది. వారే బీజేపీకి కళ్ళూ ముక్కూ చెవులూ అన్నీ కూడా. వారి చెప్పుచేతలలో పార్టీ ఎదిగి ఈ స్థాయికి వచ్చింది. ఇక ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీతో లోపాయికారీగా అంటకాగుతూ కొంతమంది బీజేపీ నేతలు ఎప్పటికపుడు మేలు చేస్తూ వస్తున్నారని అంటారు.

అలాంటి వాటికి చెక్ పెట్టేలా బీజేపీ పెద్దలు స్వతంత్రంగా వ్యవహరించే వారికే పట్టం కట్టాలనుకుని మొదట కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు. అయితే చాలా తొందరలోనే ఏపీ బీజేపీ లోతులు తెలుసుకుని కన్నా ఒక వర్గానికి సరెండర్ అయిపోయారు. ఇక ఆయనతో లాభం లేదని ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న సోము వీర్రాజుని తెచ్చి కుర్చీ ఎక్కించారు. సోము రాగానే అంతవరకూ యాక్టీవ్ గా ఉండే ఒక వర్గం ఫుల్ సైలెంట్ అయిపోయింది. అంతే కాదు ఆయనకు యాంటీగా వర్క్ చేయడం కూడా మొదలెట్టిందని ప్రచారం అయితే సాగుతోంది.

ఏపీలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలి. ఇది తమ్ముళ్లకు ఆశ. కానీ వారి కంటే ఎక్కువగా బీజేపీలోని ఆ సామాజికవర్గం నేతలు కూడా భావించడమే ఇక్కడ విడ్డూరం. వీరంతా కలసి మళ్ళీ ఏపీలో టీడీపీని, బీజేపీని కలిపేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. అదే సమయంలో అడ్డుగా ఉన్న సోము లాంటి వారిని కూడా దించేసి తమ వారికే ప్రెసిడెంట్ పీఠం అప్పగించేలా పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలు తెలుసుకున్న సోము కూడా తన దూకుడు తగ్గించేశారు అంటున్నారు.

బీజేపీకి అసలే బలం తక్కువ. దానికి తోడు వర్గాలు కూడా ఉంటే ఇక ఎప్పటికి బతికి బట్టకట్టేనూ అన్న మాట అయితే ఉంది. మరి బీజేపీలోని సోము వ్యతిరేక వర్గం ఆశలు ఫలిస్తే మాత్రం కచ్చితంగా కొత్త ప్రెసిడెంట్ తొందరలోనే వస్తారు అని అంటున్నారు. ఆయన వచ్చాక తిరిగి టీడీపీతో సయోధ్య కూడా బాగానే కుదురుతుంది అని తాజాగా వినిపిస్తున్న టాక్.